జైషే మహ్మద్‌ కమాండర్‌ సజ్జద్‌ ఆఫ్ఘని హతం 

దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్‌ కమాండర్‌ సజ్జద్‌ ఆఫ్ఘని హతమయ్యాడు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న పోలీసు ఆపరేషన్‌లో జైషే కమాండర్‌ను మట్టుబెట్టినందుకు షోపియాన్‌ పోలీసులను, భద్రతా బలగాలను అభినందిస్తున్నట్లు కాశ్మీర్‌ ఐజి విజరు కుమార్‌ తెలిపారు. 

ఈ మూడు రోజుల ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. షోపియాన్‌ రావల్‌పొరా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఆఫ్ఘనిని, మరో స్థానిక సహచరుడిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆదివారం నాటి చర్యల్లో స్థానిక సహచరుడు మరణించగా, ఆ వెంటనే కాల్పులు ఆగిపోయాయి. 

తిరిగి సోమవారం ఉదయం మళ్లీ కాల్పులు పునరుద్ధరణలో ఆఫ్ఘనిని హతమార్చినట్లు తెలిపారు. పోలీసులు, సైన్యం, సిఆర్‌పిఎఫ్‌ బలగాలు సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ సందర్భంగా మూడు గృహాలు ధ్వంసమయ్యాయి. ఒక యువకుడు గాయపడ్డాడు. కాగా, ఇంటర్‌నెట్‌ సర్వీసులు మూడో రోజు కూడా నిలిచిపోయాయి.