నోటాకు ఎక్కువ ఓట్లు వ‌స్తే ఆ ఎన్నిక‌ రద్దు చేస్తారా!

నోటాకు ఎక్కువ ఓట్లు వ‌స్తే ఆ ఎన్నిక‌ రద్దు చేస్తారా!

నోటాకు ఎక్కువ ఓట్లు వ‌స్తే ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేసి తిరిగి ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందిగా ఎన్నిక‌ల సంఘాన్ని  ఆదేశించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమ‌వారం సుప్రీంకోర్టు విచార‌ణ జ‌రిపింది. దీనిపై అభిప్రాయం చెప్పాల్సిందిగా కేంద్ర న్యాయ‌శాఖ‌, ఎన్నిక‌ల సంఘానికి నోటీసులు జారీ చేసింది. 

బీజేపీ నేత, అడ్వొకేట్ అశ్విని కుమార్ ఈ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తిర‌స్క‌రించే హ‌క్కు ఉంది. కానీ మేము కోరుకునేది గుర్తింపు కోరుకునే హ‌క్కు అని ఆయ‌న త‌ర‌ఫున వాదించిన సీనియ‌ర్ న్యాయ‌వాది మ‌నేకా గురుస్వామి కోర్టును కోరారు. 

ఈ పిటిష‌న్‌పై చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే, జ‌స్టిస్ ఏఎస్ బోప‌న్న‌, జ‌స్టిస్ వి రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌రిపింది. పిటిష‌న‌ర్ త‌ర‌ఫు వాద‌న‌లు విన్న కోర్టు.. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘం అభిప్రాయం అడిగింది. పేరున్న రాజ‌కీయ పార్టీల అభ్య‌ర్థుల‌ను ఓట‌ర్లు తిర‌స్క‌రిస్తే  పార్ల‌మెంట్‌లో సీట్లు ఖాళీగా ఉంటాయి కదా అని విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ బోబ్డే ప్ర‌శ్నించారు.

దీనిపై గురుస్వామి స్పందిస్తూ 50 శాతం నోటా ఓట్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌న్న నిబంధ‌న ఉంది. కానీ ప్ర‌స్తుతం ప‌రిస్థితి ఎలా ఉందంటే 99 శాతం మంది అభ్య‌ర్థిని తిరస్క‌రించి, ఒక్క శాతం మంది ఓటు వేసినా వాళ్లు గెలుస్తున్నారని చెప్పారు. ఇది రాజ్యాంగం స‌మ‌స్య‌. ఒక‌వేళ నోటా కార‌ణంగా అంద‌రు అభ్య‌ర్థులు తిరస్క‌ర‌ణ‌కు గురైతే, ఆ నియోజ‌క‌వ‌ర్గానికి అస‌లు ప్రాతినిధ్య‌మే ఉండ‌దు క‌దా. అలాంట‌ప్పుడు స‌రైన పార్ల‌మెంట్‌ను ఎలా ఏర్పాటుచేయ‌గ‌లం అని సీజేఐ ప్ర‌శ్నించారు.