దేశంలోని పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ఏటికేడూ క్రమంగా పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా గుట్కా, పాన్, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా పరిశోధకులు గుర్తించారు.
ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాన్-కమ్యూనికబుల్ డిసీజ్ ఎపిడెమియాలజీ (ఐసిఎంఆర్-నైన్) నిర్వహించిన ఈ అధ్యయనం గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ (గ్లోబోకాన్) 2022 డేటా ఆధారంగా 11 జీ20 దేశాల్లో క్యాన్సర్ ధోరణులను విశ్లేషించింది. ఈ విశ్లేషణ ప్రకారం భారత్‌లో పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు ప్రతి ఏడాదీ సుమారు 1.20 శాతం చొప్పున పెరుగుతున్నాయి.
కెనడా (0.94 శాతం), అమెరికా (0.57 శాతం) దేశాల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఐసీఎంఆర్-నైన్ డైరెక్టర్ ప్రశాంత్ మాథూర్ ప్రకారం నోటి క్యాన్సర్ భారత్‌లో ఒక పెద్ద ప్రజారోగ్య సమస్యగా మారుతోంది. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచే తంబాకు వినియోగం అలవాటు చేసుకోవడం, అలాగే మద్యపానం, పాన్, బీటెల్ నట్స్ నమలడం వంటి అలవాట్లు దీనికి కారణమవుతున్నాయి.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే దేశంలో ఎక్కువ శాతం నోటి క్యాన్సర్ కేసులు చివరి దశలోనే గుర్తించబడుతున్నాయి. దీంతో చికిత్స ఖర్చులు పెరగడం, ప్రాణాపాయం అధికమవుతోంది. ఇక మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అత్యధికంగా కనిపిస్తున్న క్యాన్సర్‌గా కొనసాగుతోంది.
దక్షిణ కొరియాలో అత్యధికంగా (5.07 శాతం) పెరుగుదల నమోదవగా టర్కీ, భారత్, ఇటలీ దేశాల్లో పెరుగుదల కనిపించింది. అయితే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) విషయంలో భారత్‌లో సానుకూల పరిణామం కనిపిస్తోంది. ప్రతి ఏడాదీ సుమరు 4.19 శాతం చొప్పున కేసులు తగ్గుతున్నాయి. స్క్రీనింగ్, హెచ్‌పీవీ టీకాలు అందుబాటులోకి రావడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.

More Stories
ఆలయ ప్రవేశాన్ని నాస్తికులు హక్కుగా ఎలా కోరగలరు?
`విద్వేష ప్రసంగాల’పై మరో చట్టం అవసరం లేదు
భారత్‌కు రానున్న ఎస్ 400 గగనతల వ్యవస్థలు