గూండారాజ్ గుప్పిట్లో చిక్కుకున్న బెంగాల్ 

గూండారాజ్ గుప్పిట్లో చిక్కుకున్న బెంగాల్ 

ఒకప్పుడు దేశానికి నేతగా ఉన్న పశ్చిమబెంగాల్ ఇప్పుడు గూండారాజ్యమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. విద్య, స్వాతంత్య్ర  సమరయోధులు, మత నిర్దేశకత్వం పరంగా ఎంతో వెలుగువెలిగిన బెంగాల్ గూండారాజ్ గుప్పిట్లో చిక్కుకుందని సోమవారం  రాణీబంధ్‌లో జరిగిన వర్చువల్ ర్యాలీలో షా విచారం వ్యక్తం చేశారు.

బెంగాల్‌ను తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లు వెనక్కి తీసుకు వెళ్లిందని ఆరోపించారు. ‘అవినీతి, రాజకీయ హింస, పోలరైజేషన్, పండుగలు జరుపుకోవాలంటే హిందువులు, ఎస్‌సీలు, ఎస్‌టీలు కోర్టులను ఆశ్రయించడం వంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. పాలకులు రాష్ట్రాన్ని ఇలాంటి దుస్థితికి తెచ్చారు’ అని విమర్శించారు. 

ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తాం అని అమిత్‌షా భరోసా ఇచ్చారు. బెంగాల్‌లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఝాగ్రాలో పండిట్ రఘునాథ్ ముర్ము గిరిజన్ యూనివర్శిటీ ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు అవకాశాలను మెరుగుపరుస్తామని చెప్పారు. 

12వ తరగతిలో 70 శాతానికి పైగా మార్కులు సాధించిన గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం 50 శాతం ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. గిరిజన వర్గాలు ఆత్మనిర్భర్‌ వైపుగా పురోగమించేందుకు ‘స్టాండ్ అప్ ఇండియా’ స్కీమ్ కింద పశ్చిమబెంగాల్‌కు రూ.100 కోట్లు సాయం చేస్తామని  హామీ ఇచ్ఛారు. 

ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు వచ్చినప్పటికీ దురదృష్టవశాత్తూ తన హెలికాప్టర్ దెబ్బతిందని, దాంతో ప్రజలను నేరుగా కలుసుకోలేక పోయానని అమిత్‌షా తెలిపారు. నందిగ్రామ్ ఘ‌ట‌న‌ను ప్రస్తావిస్తూ ‘నా హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక లోపం కార‌ణంగా నా‌కు ఆల‌స్య‌మైంది. కానీ దీనిని కుట్ర అని నేను అన‌ను” అని అమిత్ షా ఎద్దేవా చేశారు. 

నందిగ్రామ్ ఘ‌ట‌న మ‌మ‌త‌పై జ‌రిగిన దాడి కాదని ఎన్నిక‌ల సంఘం కూడా తేల్చిన విష‌యాన్ని అమిత్ షా గుర్తు చేశారు. “మీ హయాంలో 130 మంది చ‌నిపోయారు. వాళ్ల బాధ ఎంతో మీకు తెలుసా?  మీ కాలికి గాయం త‌గిలిన త‌ర్వాత మీకు నొప్పి తెలుస్తోంది” అని షా విమ‌ర్శించారు.

నందిగ్రామ్‌లో నామినేష‌న్ వేసిన త‌ర్వాత మ‌మ‌తా గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే ఎవ‌రో న‌లుగురైదుగురు వ్యక్తులు త‌న‌ను కావాల‌నే తోసేయ‌డం వ‌ల్ల గాయ‌ప‌డ్డాన‌ని, ఇది కుట్ర అని మ‌మ‌త ఆరోపించారు. అయితే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిన ఎన్నిక‌ల సంఘం మాత్రం మ‌మ‌త‌పై దాడి జ‌ర‌గ‌లేద‌ని తేల్చింది.