రోడ్డుకు ఇరువైపులా మతపరమైన నిర్మాణాల తొలగింపు 

రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన మతపరమైన నిర్మాణాలను తొలగించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలకు మూలకారణంగా నిలుస్తున్న మతపరమైన కట్టడాలను తక్షణమే తొలగించాలని అక్కడి ప్రభుత్వం కఠిన ఆదేశాలిచ్చింది. మతం ముసుగులో మతపరమైన స్థలాలను నిర్మించడం ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌లో బహిరంగ ప్రదేశాలను ఆక్రమించుకునే ఆట చాలా ఏండ్లుగా కొనసాగుతున్నది.

ఇప్పటివరకు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా వీటి విషయంలో ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మతం ముసుగులో విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే ఆటలు ఇకపై సాగవని ఆదిత్యనాథ్  ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. ముఖ్యంగా ప్రధాన రహదారులపై, రహదారి మధ్యలో ఆలయం, మసీదు, సమాధులు, దర్గాలు మొదలైనవి నిర్మించడం ద్వారా జరుగుతున్న వ్యాపారం నిలిపివేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

మతం పేరుతో రోడ్లను ఆక్రమిస్తున్న వారిపై కోర్టులు ఎప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఈ సమస్య పరిష్కరానికి నోచుకోవడంలేదు. బహిరంగ ప్రదేశాలు, రోడ్లను ఆక్రమించడం ద్వారా నిర్మించిన అన్ని మత స్థలాలను తొలగించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సోమవారం కఠినమైన ఉత్తర్వులు ఇచ్చింది.

రహదారిని ఆక్రమించి నిర్మించిన మతపరమైన నిర్మాణాలను ఎలాంటి ఉపేక్ష లేకుండా తొలగించాలని ఆయన అధికారులకు సూచించారు. రోడ్లను ఆక్రమించి నిర్మించిన మతపరమైన కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరి నెలలో లక్నో హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను నియమించి తగు చర్యలు తీసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే చాలా నిర్మాణాల్లో మరమ్మతు పనులు చేపట్టడం లేదని తెలుస్తున్నది. ఇటువంటి పలు నిర్మాణాలు ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్, ముజఫర్‌నగర్ సహా అనేక నగరాల్లోని రోడ్ల పైనుంచి తొలగించారు. 2018 ఫిబ్రవరిలో ముజఫర్‌నగర్‌లో వంతెన నిర్మాణం కోసం ఏకంగా ఒక మసీదునే తొలగించారు.