జేడీయూలో ఆర్‌ఎల్‌ఎస్పీ విలీనం

రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా తొమ్మిదేండ్ల అనంతరం తిరిగి బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ చెంతకే చేరారు. తన పార్టీని అధికార జేడీయూలో విలీనం చేశారు. 
ఆ వెంటనే కుష్వాహాను జాతీయ పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు నితీశ్‌ ప్రకటించారు.  ఇప్పటి వరకు పార్టీలో ఈ పదవిని ఎవ్వరికీ ఇవ్వలేదు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆర్ సి పి సింగ్ తో సంబంధం లేకుండా నేరుగా తనతో కలసి వ్యవహరించేందుకు వీలుగా ఈ పదవిని ఏర్పాటు చేసిన్నట్లు పలువురు భావిస్తున్నారు. 
పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు 2007లో జేడీయూ నుంచి కుష్వాహా బహిష్కరణకు గురయ్యారు. రెండేండ్ల తర్వాత ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. అయితే 2013లో ఆయన జేడీయూ నుంచి బయటికొచ్చి ఆర్‌ఎల్‌ఎస్పీ ఏర్పాటు చేశారు. “ఉపేంద్ర కుష్వాహా తిరిగి రావడంతో మన పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది” అని ఈ సందర్భంగా నితీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. “నితీష్ కుమార్ నా అన్న” అంటూ ఉపేంద్ర కుష్వాహా పేర్కొన్నారు. “రాజకీయాలలో నా ఎత్తుపల్లాలు అన్ని నితీష్ కుమార్ తోనే ముడిపడిఉన్నాయి” అంటూ తెలిపారు.
తన భార్యకు ఎమ్యెల్సీ సీట్ ఇస్తానని చెప్పడంతో పార్టీని విలీనం చేసిన్నట్లు వస్తున్న కధనాల గురించి మీడియా ప్రశ్నించగా “ఎటువంటి ముందస్తు షరతు లేకుండా పార్టీని విలీనం చేస్తున్నాను. ఎటువంటి రాజకీయ పదవి ఆశించడం లేదు ” అని స్పష్టమ చేశారు. కుష్వావా చేరికతో జేడీయు వర్గాలలో ఉత్సాహం కనిపిస్తున్నది. 10 శాతం మేరకు రాష్ట్ర జనాభాలో ఉన్న లవ్ – కుష్ (కూర్మి-కోయిరి) ఓటర్లను ఏకీకృతం చేసే కృషిలో భాగంగా నితీష్ కుమార్ కుష్వావను కలుపుకొన్నట్లు కనిపిస్తున్నది.
2014 ఎన్నికల సమయంలో ఎన్డీయే లో చేరి మూడు లోక్ సభ స్థానాలను గెలుచుకొని, కేంద్ర మంత్రివర్గంలో కూడా చేరారు. 2019లో మహాకూటమి భాగస్వామిగా పోటీ చేసినా ఒక సీట్ కూడా పొందలేక పోయారు. కొంతకాలం రాజకీయంగా మౌనంగా ఉంది, ఇప్పుడు జేడీయులో విలీనం అయ్యారు.