సిద్దిపేట జిల్లా కలెక్టర్‌కు 3 నెలల జైలు శిక్ష

సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ పి.వెంకటరామిరెడ్డికి జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కార కేసులో ఆయనకు హైకోర్టు 3 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పిటిషనర్లకు కోర్టు ఖర్చుల కింద 4 వారాల్లో రూ.25 వేలు కూడా చెల్లించాలని ఆదేశించింది.
వెంకట్రామిరెడ్డి తర్వాత సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేసిన కృష్ణభాస్కర్‌ (ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌)కూ రూ.2 వేల జరిమానా విధించింది. కొమరవెల్లి మల్లన్నసాగర్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (భూసేకరణ)గా పని చేసిన జయచందర్‌ రెడ్డికి 4 నెలల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. 
 
పిటిషనర్లకు కోర్టు ఖర్చుల నిమిత్తం 4 వారాల్లోగా రూ.50 వేలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడినందుకు అధికారుల సర్వీస్‌ బుక్‌లో రిమార్క్స్‌ నోట్‌ చేయాలని కూడా స్పష్టం చేసింది.
 
ఈ ఆదేశాలపై అప్పీలుకు 6 వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు తన ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల ఆదేశించారు. కోర్టు ధిక్కార కేసులో జైలు శిక్ష పడిన అధికారులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.250 చొప్పున జీవనాధార భత్యాన్ని 6 వారాల్లోగా పిటిషనర్లు డిపాజిట్‌ చేయాలని స్పష్టం చేసింది. 
 
వేములఘాట్‌ సర్వే నెం.849/1/1, 850/12లలోని 23 గుంటకు పైగా భూమికి సంబంధించి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌, పరిహారం కింద జిల్లా కలెక్టర్‌ జూలై 2, 2019న జారీ చేసిన అవార్డులను రద్దు చేసింది. భూ సేకరణ చట్టంలోని సెక్షన్‌ 11(1) కింద జూలై 30, 2017న జారీ చేసిన నోటిఫికేషన్‌కు రెండేళ్ల కాలం తీరినందున అది చెల్లదని స్పష్టం చేసింది. 
 
భూ సేకరణ చట్టం-2013 కింద జిల్లా కలెక్టర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌(భూసేకరణ) తాజా నోటిఫికేషన్‌ జారీ చేసి నష్టపరిహారం, ఆర్‌ అండ్‌ ఆర్‌ బెనిఫిట్స్‌ను కోర్టు ఆదేశాలు అందిన 4 నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.