భైంసా ఘటనలో 13 మందిపై కేసు: నిందితుల్లో ఎంఐఎం కౌన్సిలర్

తెలంగాణ: నిర్మల్ జిల్లా భైంసాలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఘటన జరిగిన రెండు రోజులకు 15 కేసులు నమోదయ్యాయి.

అల్లర్లలో క్రియాశీలక పాత్ర పోషించిన ఇద్దరు సిట్టింగ్ కౌన్సిలర్లతో సహా 13 మందిని అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ ప్రకటనను ఉటంకిస్తూ ది న్యూస్ మినిట్ వార్తను ప్రచురించింది. అరెస్టైన కౌన్సిలర్లలో ఒకరు ఎంఐఎం పార్టీకి చెందినవారు కాగా, మరొకరు స్వతంత్రులు.

భైంసాలో రెండు వర్గాల మధ్య ఆదివారం సాయంత్రం మొదలైన ఘర్షణలో రెండు ఇళ్ళు, తొమ్మిది వాహనాలకు నిప్పంటించారు. రాతితో కొట్టడంతో కొంతమంది జర్నలిస్టులు, ముగ్గురు పోలీసులతో సహా ఆరుగురు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ద్విచక్రవాహనాన్ని సంబంధించి జరిగిన వాదన చిలికిచిలికి హింసాకాండకు దారితీసింది. ఇది మొత్తం పట్టణానికి వ్యాపించిందని పోలీసులు తెలిపారు.

ఎస్పీ విష్ణు వారియర్ ను ఉటంకిస్తూ న్యూస్ మినిట్ కధనం ప్రకారం.. మరో 22 మంది తమ కస్టడీలో ఉండగా వారిని త్వరలో రిమాండ్‌కు తరలించనున్నారు. “మేము వివిధ మార్గాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్నాము. అనుమానితులను గుర్తించి అరెస్టు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మొత్తం 450 మంది పోలీసు సిబ్బంది పహారా కాస్తుండగా వారిలో 50 మంది ఉన్నతాధికారులు ఉన్నారని, పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ తెలిపారు.

హింసకు గురైన బాధితులను పరామర్శించడానికి భైంసా సందర్శించడానికి ప్రయత్నించిన బిజెపి ఎంపీలు సోయం బాపు రావు, ధర్మపురి అరవింద్‌లను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అరవింద్‌ను గృహ నిర్బంధంలో ఉంచగా, నిర్మల్‌కు వెళుతున్న బాపురావును బాల్కండలో అదుపులోకి తీసుకున్నారు.

హింసకు సంబంధించి, కేంద్ర హోంశాఖ సహాయకమంత్రి  జి. కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

“గత 30-40 సంవత్సరాలుగా భైన్సాలో మత అల్లర్లు జరుగుతున్నాయి. ఇది మళ్ళీ మూడు రోజుల క్రితం జరిగింది. ఈ అల్లర్ల వెనుక సామాజిక వ్యతిరేక అంశాలు ఉన్నాయి, అవి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అల్లర్లు సామాన్య ప్రజలపై దాడి చేయడానికి పెద్ద కుట్రలో భాగమే అనిపిస్తుంది” అని కిషన్ రెడ్డి అన్నారు.