తెలంగాణకు రూ.2,384 కోట్లు విడుదల

వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద తెలంగాణ రాష్ట్రానికి 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 2020-21 సంవత్సరానికి రూ.2,384 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. 
 
రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు బండ ప్రకాశ్‌ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఈ నిధుల్లో అదనపు ఆర్థిక సహాయం కూడా ఉందని పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2015 నుంచి 2020 వరకు మొత్తం రూ.9,788.95 కోట్లు విడుదల చేశామని మంత్రి తెలిపారు. 
 
కాగా, తెలంగాణలో ధాన్యం సేకరణ కేంద్రాలను మూసివేస్తామని కేసీఆర్‌ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో 6,044 ధాన్యం సేకరణ కేంద్రాలను స్వయం సహాయక బృందాలు, ప్రాథమిక సహకార సంఘాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తమకు సమాచారం అందించిందని ఆయన వెల్లడించారు.