భైంసా: పోలీసుల అదుపులో 50 మందికి పైగా నిందితులు

భైంసాలో ఇరువర్గాల మధ్య జరిగిన అల్లర్లకు సంబంధించి 50 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు నిర్మల్ జిల్లా పోలీసులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం పట్టణంలోని జుల్ఫికర్‌ కాలనీలో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న చిన్న వివాదం.. చినికిచినికి గాలివానగా మారి ఇతర ప్రాంతాలకు వ్యాపించిన విషయం తెలిసిందే.

ఈ అల్లర్లలో 12 మంది గాయపడగా, వారిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలవ్వడంతో ఒకరిని ప్రయివేట్ ఆస్పత్రికి, మరో ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించామని జిల్లా ఇన్-ఛార్జ్ ఎస్పీ విష్ణు వారియర్ తెలిపారు. గాయపడిన వారు ప్రమాదం నుండి కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని తెలిపారు.

ఈ ఘటనపై ఇప్పటికే కేసులు నమోదు చేసినట్టు తెలిపిన పోలీస్ వర్గాలు, మరిన్ని కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు.

జుల్ఫికర్‌ కాలనీలో ఇరువర్గాలు మధ్య జరిగిన దాడుల కారణంగా అల్లర్లు క్షణాల్లో బట్టీగల్లీ, పంజేషా చౌక్‌, కోర్బగల్లీ, బస్టాండ్‌ ఏరియాతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాలకు వ్యాపించాయి.

ఓ వర్గం యువకులు.. ప్రత్యర్థి వర్గం వారికి చెందిన రెండు ఆటోరిక్షాలు, ఒక కారు, మరో రెండు ద్విచక్రవాహనాలను తగులబెట్టారు. జనావాసాలపై రాళ్లు రువ్వారు. కత్తులతో కాలనీల్లో స్వైర విహారం చేశారు. గృహ దహనాలకు పాల్పడ్డారు. ఒక కూరగాయల దుకాణాన్ని తగులబెట్టారు. కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కత్తులతో దాడి చేశారు.

 

Source: Times of India