తెలంగాణలో బీజేపీకి అద్భుత ఆదరణ

తెలంగాణలో బీజేపీకి అద్భుత ఆదరణ
తెలంగాణలో బీజేపీకి అద్భుత ఆదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషం ప్రకటించారు. గత బీఆర్‌ఎస్‌ దుష్పరిపాలన, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, అందుకే వారు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు.  మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆదివారం రాష్ట్రానికి రానున్న మోదీ రూ.9,400 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
 
ఈ సందర్భంగా తన పర్యటన షెడ్యూల్‌ను తెలుపుతూ శనివారం రాత్రి తెలుగులో ట్వీట్‌ చేశారు. “నేను రేపు కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థను స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయం 11 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటాను. మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకొని సుమారు రూ.9,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తాను” అని తెలిపారు. 
 
“ఈ పనులు రహదారులు, లాజిస్టిక్స్‌, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధన తదితర రంగాలకు సంబంధించినవి. సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్‌ఎస్‌ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో కూడా విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్న మద్దతు, తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టంచేస్తోంది” అని ప్రధాని ట్వీట్‌ చేశారు.
 
పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరి ఎన్నికల్లో గెలుపు తర్వాత నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. బీజేపీ తెలంగాణపై దృష్టి పెట్టిందన్న ప్రచారం నడుమ ప్రధాని పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రధాని కర్ణాటక నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.  అక్కడి నుంచి హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్ ప్రారంభిస్తారు.  
 
హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా, గూడెబెల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు పీఎం శ్రీకారం చుట్టున్నారు.  హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ కింద సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి చేస్తున్న జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.  వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో అభివృద్ధి చేసిన పీఎం మిత్రా పార్క్‌ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ ఆయిల్ మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్ట్‌ను కూడా దేశానికి అంకితం చేయనున్నారు.

తిరిగి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయా పరిస్థితులపై ఆరా తీసి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ మైదానానికి చేరుకుని బహిరంగ సభలో పాల్గొనున్నారు.

ప్రధాని మోదీ ఆదివారం దాదాపు 5 గంటలపాటు హైదరాబాద్‌లో ఉండనున్నారు. మోదీ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ కోసమే రెండువేల మంది పోలీసులను నియమించినట్లు మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి శనివారం తెలిపారు.  సభా ప్రాంగణం చుట్టూ ఉన్న ప్రాంతాల రహదారులను సీసీటీవీ నిఘాలో ఉంచామని చెప్పారు. సభ ముగిసేవరకు ప్రైవేటు వ్యక్తులు డ్రోన్‌లు ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 8712662999 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.