వరంగల్ జిల్లాలోని ఖానాపుర్ మండలం అశోక్‌నగర్‌లో ఉన్న 800 ఏళ్ల నాటి చారిత్రక కాకతీయ శివాలయం కూల్చివేతకు గురైన ఘటన ఆలస్యంగా వెలగులోకి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థలసేకరణలో భాగంగా ఈ మట్టి కోట స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం చదును చేస్తున్న క్రమంలో లోపల ఉన్న శివాలయాన్ని కూల్చివేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.
ఈ ఆలయం కూల్చివేయడంపై కేంద్ర సాంస్కృతిక శాఖ, చరిత్రకారుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కాకతీయ రాజు గణపతి దేవుడి కాలం అంటే క్రీ.శ 1231 నాటి అరుదైన శాసనాలు ఈ ప్రాంతంలో వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. అక్కడ లభించిన అరుదైన 7 వరుసల తెలుగు శాసనం ద్వారా దాని చారిత్రక ప్రాధాన్యత తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన వరంగల్ కలెక్టర్ సత్యశారద అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ శివాలయం ఉందని అనుకోలేదని చెట్లపొదల్లాగా ఉండటంతోనే కూల్చివేశారు తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మిస్తామని ప్రకటించారు.
ఇప్పటి వరకు ఆ శివాలయాన్ని తెలంగాణ పురావస్తుశాఖ గుర్తించలేదని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వారు నోటిఫై చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్థపతిలు, చరిత్రకారుల సలహాతో అధికారిక రక్షిత కట్టడంగా ప్రకటించేందుకు చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. ఈ ఆలయం కూల్చివేత ఘటనపై రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా విచారణ జరిపారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆ స్థలం ప్రభుత్వానిదేనన్న కలెక్టర్ గతంలో గిరిజన సంక్షేమ శాఖకు దానిని కేటాయించారని గుర్తుచేశారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి 30 ఎకరాల్లో పొదలను తొలగిస్తుండగా ఈ పురాతన కట్టడాన్ని కూల్చివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి మాత్రమేనని, దేవాదాయ శాఖకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. కానీ, ఈ కట్టడాన్ని 1965లో వారసత్వ శాఖ నమోదు చేసింది. ప్రాచీన కోట కట్టడాలకు ప్రసిద్ధి చెందిన చారిత్రక “కోట కట్ట” మట్టి కోట ప్రాంతంలో ఇది నెలకొని ఉంది. ప్రముఖ మానవ హక్కుల లాయర్ ఇమ్మనేని రామారావు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.
తెలంగాణ హెరిటేజ్ చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం అనుమతులు లేకుండా ఆలయాన్ని కూల్చివేసిందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. చారిత్రక కట్టడాలను కూల్చివేయడం వల్ల భౌతికంగా నష్టం మాత్రమే కాదని, అది సంస్కృతి ఆనవాళ్లు లేకుండా చేయడమేనని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇమ్మనేని రామారావు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. తక్షణమే ఆ శివాలయం ఘటనపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలంలో చారిత్రక కట్టడమైన కాకతీయ కాలం నాటి శివాలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ధర్మాగ్రహ దీక్షకు దిగారు. నర్సంపేట పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా కూల్చివేసిన ఆలయ స్థలంలో వేద పండితులతో జిల్లా నేతలు శుద్ధి పూజ చేయించారు.
ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాతనే ఇంటిగ్రేటేడ్ స్కూల్ నిర్మాణ పనులు చేయాలని నినాదాలు చేశారు. బీజేపీ శాసనసభపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించి తాము స్కూల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని కాకతీయ కళా సంపదలో భాగమైన శివాలయాన్ని కూల్చివేయడాన్నే ఖండిస్తున్నామని తెలిపారు.

More Stories
ఎస్ఐఆర్ ప్రక్రియ పశ్చిమ బెంగాల్‌ను బీజేపీకి గెలిపించిందా?
టిసిఎస్ నాశిక్ కేసులో నిదా ఖాన్ పరారీకి ఏఐఎంఐఎం సహాయం!
ఇరాన్ యుద్ధంతో చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం