అంకెల్లో ఉద్యోగాలు, బతుకుల్లో నిరుద్యోగం

ఎన్‌. రామచందర్‌రావు,

శాసనమండలి సభ్యులు, బీజేపీ 

మనరాష్ట్రంలోని ఉద్యోగ ఖాళీల విషయంలో మంత్రులు, ఆర్థికశాఖ, వేతన సవరణ సంఘం, కేటీఆర్‌ పేర్కొంటున్న వివరాలలో ఏమాత్రం పొంతన లేదు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర వాటాకు వచ్చిన ఉద్యోగాల సంఖ్య 5,23,675 అని ప్రభుత్వం 2014 నవంబర్‌ 24న అసెంబ్లీలో ప్రకటించింది. ఇందులో 83 వేల మంది ఆంధ్ర ఉద్యోగులున్నారని, వారిని వాళ్ల రాష్ట్రానికి పంపిస్తామని చెప్పింది. తద్వారా ఏర్పడ్డ ఖాళీలను తెలంగాణ నిరుద్యోగ యువతతో భర్తీ చేస్తామని తెలిపింది.

కానీ ఈ 83 వేలల్లో ఎంతమందిని పంపించింది, ఇంకా ఎంతమంది ఉన్నది ఇత్యాది వివరాలను మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు వెల్లడించలేదు. అదే విధంగా సమాచార హక్కు చట్టం కింద 2017 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం, మన రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 2,96,687 కాగా తాజాగా వేతన సవరణ సంఘం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఉండాల్సిన ఉద్యోగస్థులు 4,91,304 మంది. ప్రస్తుతం ఉన్నది 3,00,178 మంది. ఖాళీలు 1.91 లక్షలు. ప్రతి 1000 మందికి మన రాష్ట్రంలో 8.5 మంది ఉద్యోగస్థులున్నట్లు వేతన సంఘం పేర్కొంది. ఈ లెక్కలలో ఎక్కడా పొంతన లేదు.

గత ఆరున్నర సంవత్సరాలలో తమ ప్రభుత్వం 1,32,899 మందిని ఉద్యోగాలలో నియమించినట్లు కేటీఆర్‌ ఇటీవల పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో ఉండాల్సిన ఉద్యోగస్థులు ఎంతమంది? ప్రస్తుతం ఉన్నదెంత మంది? ఖాళీలెన్ని? ఈ ఖాళీలు ఎప్పటి నుంచి ఉన్నాయి అనే వివరాలు వెల్లడించకుండా తాము 1,33,000మందికి ఉద్యోగాలు ఇచ్చామని చాటుకుంటున్నారు. వారు ఇచ్చామంటున్న ఉద్యోగాల వివరాలు ప్రధానంగా ఈవిధంగా ఉన్నాయి:

రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 30,594, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 31,972, సింగరేణిలో 12,500, విద్యుత్‌శాఖలో 22,637, ఆర్టీసిలో 4768, పంచాయతీ సెక్రటరీలుగా 9365, రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలల్లో 3623 మందిని నియమించారు. రాష్ట్రపబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ ద్వారా జరిగిన నియామకాలను పక్కకుపెట్టి మిగతా వాటిని ఓసారి పరిశీలిద్దాం.

సింగరేణిలో జరిపామంటున్న 12,500 నియామకాల్లో పదివేల వరకు డిఫెండెంట్‌ ఉద్యోగాలే. కొత్తగా కల్పించినవి  మూడువేలు కూడా లేవు. ఇక పోలీస్‌ శాఖలో భర్తీ చేశామంటున్న 31,972 ఉద్యోగాల్లో సగానికిపైగా జరిగిన నియామకాలు ఆ సంస్థలో హోంగార్డులుగా పని చేస్తున్న వారివేనన్నది నగ్నసత్యం. అదేవిధంగా విద్యుత్‌శాఖలో జరిపిన 22,637 నియామకాల్లో సగానికి పైగా ఆ శాఖలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్నవారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చేశారు తప్ప కొత్తగా కొలువులు ఇచ్చింది

అతి స్వల్పం అన్న విషయం గమనించాలి. ఆర్టీసిలోని 4768 నియామకాల్లో కూడా దాదాపు ముప్పావు వంతు నియామకాలు కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగస్థుల సర్వీసులను క్రమబద్ధీకరించడమే తప్ప ఉద్యోగ ప్రకటనల ద్వారా భర్తీ చేసినవి కావు. ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ఆ ప్రకారం భర్తీ చేసిన ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల జాబితాలోకి వస్తాయి. ఆ విధంగా ప్రభుత్వం గత ఆరున్నర సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అన్నది ప్రశ్న.

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు 1,061 అని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు గతకొన్ని సంవత్సరాలుగా వైస్‌ఛాన్సలర్లు, పాలకమండళ్లు లేకపోవడం అన్న విషయాన్ని గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కాలేజీల్లో మంజూరైన పోస్టులు 2,730.

ఇందులో భర్తీ అయినవి 1,419, ఖాళీలు 1,311. జూనియర్‌ కాలేజీల్లో మొత్తం మంజూరు అయిన పోస్టులు 5,278. భర్తీ అయినవి 836, ఖాళీలు 4,442. రాష్ట్రంలోని కళాశాల రంగంలో మంజూరు అయిన పోస్టులు 14,008 కాగా అందులో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 3,685 మాత్రమే. ఇంకా 10,331 ఖాళీలు ఉన్నాయి. పాఠశాల విద్య కూడా దాదాపు ఇదే విధంగా ఉంది. అసెంబ్లీలో 2014 నవంబర్ 24న చేసిన ప్రకటన సందర్భంగా నాటి ఆర్థికమంత్రి 24,261 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. వాటిలో నియామకాలు జరిగినవి ఎన్ని? చేయాల్సిందెన్ని? 2014–-2021 మధ్యకాలంలో మూసివేసిన పాఠశాలల వివరాలు కేటీఆర్‌ వెల్లడించకపోవడం విచారకరం.

రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో ఓసారి పరిశీలిద్దాం. మన రాష్ట్రంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ కింద నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 24 లక్షల 54 వేలు. ఇందులో పురుషులు రమారమి 15 లక్షలు, మహిళలు 10 లక్షలు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవారిలో 25 ఏళ్ల లోపువారు 16 లక్షలు. ఇందులో ఇంజనీరింగ్‌ పట్టభద్రులే రమారమి 4,27,324 మంది అంటే రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరున్నర సంవత్సరాల కాలంలో నిరుద్యోగం ఏ విధంగా పెరిగిందో చూద్దాం. 2014లో రాష్ట్రంలో నిరుద్యోగం 2.7 శాతం కాగా 2019 నాటికి అది 8.3 శాతానికి చేరుకుంది. డిప్లొమా చదువుకున్నవారిలో నిరుద్యోగం 2014లో 6 శాతం ఉంటే అది 2019 నాటికి 34 శాతానికి పెరిగింది. పట్టభద్రుల్లో నిరుద్యోగం 7.3 శాతం నుంచి 27.7 శాతానికి చేరుకుంది. పోస్టుగ్రాడ్యుయేట్లలో 7.3 శాతం నుంచి 31.3 శాతానికి చేరుకుంది. రాష్ట్రం ఏర్పడిన పిదప నిరుద్యోగం నాలుగురెట్లు పెరిగింది అన్నది నిర్వివాదాంశం.

ప్రభుత్వం నియమించిన వేతన సవరణ సంఘం తమ నివేదికలో, ఉద్యోగ ఖాళీలు రమారమి 1.91 లక్షలు అని తేల్చింది. ప్రభుత్వం పాలనా సౌలభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 33 జిల్లాలు 33 కలెక్టరేట్లు, 584 మండలాలు, 126 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 12,751 గ్రామ పంచాయతీలు, 9 పోలీస్‌ కమిషనరేట్లు, 114 పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 715 పోలీస్‌స్టేషన్లు, 78 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది.

ఈ సంస్థలన్నీ సజావుగా పనిచేయాలంటే ఒక్కో జిల్లాకు అదనంగా 2000 మంది ఉద్యోగస్థుల అవసరం ఉంటుంది. ఈ లెక్కన ఈ సంస్థలన్నింటికీ కలిపి అవసరమైన సిబ్బంది 66,000. మన రాష్ట్రంలో ప్రతినెల సగటున 600 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. దానిననుసరించి లెక్కకడితే ప్రతిసంవత్సరం రిటైర్‌ అవుతున్నవారు 7000-–8000 మధ్య ఉంటారు.

అంటే గత ఆరున్నర సంవత్సరాల కాలంలో రిటైర్‌ అయినవారు దాదాపు 50వేలకు పైగానే ఉంటారన్నమాట. వేతన సవరణ సంఘం తమ నివేదికలో పేర్కొన్న 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలకు ఈ సంఖ్యలను కలిపితే రాష్ట్రంలో మొత్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీలు 3,07,000. వాస్తవ లెక్కలు ఇలాఉంటే ప్రభుత్వం మాత్రం 50 వేల ఉద్యోగాలు ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవాలని ఆలోచించడం శోచనీయం.

ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంచుతామని, పే రివిజన్‌ అమలుపరుస్తానని, కాంట్రాక్ట్‌ ఉద్యోగస్థులందరి సర్వీసులను క్రమబద్ధీకరిస్తానని, ఇకముందు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు అనే పదమే లేకుండా చేస్తానని ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసిన కేసీఆర్‌ మాట తప్పడం విచారకరం. దాంతోపాటు ఉద్యోగం లభించని వారికి నెలకు రూ.3016 నిరుద్యోగభృతి ఇస్తానని చెప్పి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు దాని గురించి కేసీఆర్‌ గానీ, కేటీఆర్‌ కానీ మాట్లాడకపోవడం శోచనీయం.

రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం తమవద్ద వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌ కింద నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య 25 లక్షలు. ఈ 25 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు 3016 చొప్పున రెండు సంవత్సరాలకు గాను చెల్లించాల్సిన నిరుద్యోగభృతి రమారమి 2000 కోట్ల వరకు ఉంటుంది. ఈ విషయాలేవీ మాట్లాడకుండా కేటీఆర్‌ తమ ప్రభుత్వం గత ఆరున్నర సంవత్సరాలలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య లక్షా ముప్పది మూడువేలు అని చెప్పడం హాస్యాస్పదం.

చివరగా రాష్ట్రంలోని ఉద్యోగాలపై తప్పుడు సమాచారం ఇచ్చి చర్చకు రాని కేటీఆర్‌కి మూడు సూచనలు: 1.మొత్తంగా రాష్ట్రంలో ఉండాల్సిన ఉద్యోగాలెన్ని? ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ఖాళీలెన్ని? వీటిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. 2. ఖాళీలు అన్నింటినీ పారదర్శకంగా భర్తీచేయాలి. 3. నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగభృతి ఇవ్వాలి.

(ఆంధ్రజ్యోతి నుండి)