టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో న్యూజిలాండ్‌తో భారత్ 

మొట్ట‌మొద‌టి వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో న్యూజిలాండ్‌తో భారత్  త‌ల‌ప‌డ‌నున్న‌ది.  పాయింట్ల ప‌ట్టిక‌లో కోహ్లీ సేన టాప్‌లో నిలిచింది. 

  నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 25 ర‌న్స్ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం న‌మోదు చేసింది. సిరీస్‌ను 3-1 తేడాతో నెగ్గిన భార‌త్‌.. జూన్‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోకి  ప్ర‌వేశించింది. జూన్‌లో ఇంగ్లండ్‌లో జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో కివీస్‌తో భార‌త్ పోటీప‌డ‌నున్న‌ది.    చివరి టెస్టులో ఇంగ్లండ్ ఓటమి పాలు కావడంతో ఆస్ట్రేలియా ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఇంగ్లండ్ అంతకుముందే రేసు నుంచి నిష్క్రమించింది.

ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్  సంపూర్ణ ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. 560 పాయింట్ల‌తో టెస్ట్ చాంపియ‌న్‌షిప్ టేబుల్‌లో టాప్‌లో నిలిచింది. మొత్తం ఆరు సిరీస్‌లు ఆడిన ఇండియా.. 12 మ్యాచ్‌ల‌ను గెల‌వ‌గా.. నాలుగింట్లో ఓడింది. ఇక న్యూజిలాండ్ 420 పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో ఉన్న‌ది.

5 సిరీస్‌లు ఆడిన న్యూజిలాండ్ ఏడు టెస్టుల్లో గెల‌వ‌గా.. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.  ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, పాకిస్థాన్ ఆ త‌ర్వాత స్థానాల్లో నిలిచాయి. టెస్టు టీమ్ ర్యాంకుల‌ను కూడా ఐసీసీ ప్ర‌క‌టించింది. కోహ్లీ సేన 122 పాయింట్ల‌తో తొలి ర్యాంక్ సాధించింది. 118 పాయింట్ల‌తో న్యూజిలాండ్ రెండ‌వ  ర్యాంక్‌లో నిలిచింది.

మొతెరా స్టేడియంలో జ‌రిగిన మూడ‌వ టెస్టును కేవ‌లం రెండు రోజుల్లోనే మ‌నోళ్లు ముగించారు.  ఇక నాలుగ‌వ టెస్టు కూడా కేవ‌లం మూడు రోజుల్లోనే ముగిసింది.  దీంతో టెస్టుల్లో భార‌త్ పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. 

నాలుగ‌వ టెస్టు రెండ‌వ ఇన్నింగ్స్‌లో స్పిన్న‌ర్లు అశ్విన్, అక్ష‌ర్‌లు ఇర‌గ‌దీశారు.  ఇద్ద‌రూ చెరో అయిదు వికెట్ల‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు.  దీంతో ఇంగ్లండ్ త‌న రెండ‌వ ఇన్నింగ్స్‌లో కేవ‌లం 135 ర‌న్స్‌కే ఆలౌటైంది.  అంత‌క‌ముందు భారత్  త‌న తొలి ఇన్నింగ్స్‌లో 365 ర‌న్స్ చేసింది.  ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ సెంచ‌రీ చేయ‌గా.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 96 చేసి నాటౌట్‌గా నిలిచాడు.