వివాదాస్పదంగా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా ప్రముఖ నేత కె కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి పదవీ బాధ్యతలు చేపట్టి ఇంకా నెలరోజులు కాకుండానే ఆమె మాటలు, చేతలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా, సోషల్‌ మీడియాలో ఆమె చేతలు వైరల్‌ అవుతున్నాయి.
బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మేయర్‌ హోదాలో ఒక టీవీ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వరదలపై చేసిన వ్యాఖ్యలు, అందుకు ఆమె ప్రతిస్పందన జనం ఇంకా మరచిపోక ముందే మేయర్ ఛాంబర్ లో  ఎమ్యెల్సీ ఎన్నికల కరపత్రాల పంపిణీ వివాదానికి తావిచ్చింది. తాజాగా క్యాంప్‌ ఆఫీస్‌కు (ఇంటికి) 25 కేవీ జనరేటర్‌ కావాలంటూ కమిషనర్‌కు నోట్‌ పెట్టడం దుమారం రేపుతోంది.

ఓవైపు ప్రభుత్వం 24 గంటలపాటు కోతల్లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెబుతుంటే, తరచూ విద్యుత్‌ కోతల వల్ల పనులకు అంతరాయం కలుగుతూ, రోజువారీ పనుల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ‘నోట్‌’లో పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీన ఆమె రాసిన ఈ నోట్‌ కాపీ వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. 

దీంతో, శుక్రవారం సాయంత్రం వివరణనిస్తూ మేయర్‌  విజయలక్ష్మి పత్రికా ప్రకటన జారీ చేశారు. తన నివాసం వద్ద విద్యుత్‌లైన్ల నిర్మాణానికి తవ్వకాలు జరుగుతున్నందున విద్యుత్‌ అంతరాయం కలుగుతోందని, అందువల్లే తాత్కాలికంగా విద్యుత్‌ జనరేటర్‌ ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్‌ను కోరినట్లు పేర్కొన్నారు. 

అంతేతప్ప నగరంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉందని తాను పేర్కొన్నట్లుగా కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న కథనాలు అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేవిధంగా ఉన్న వీటిపై తానూ తీవ్ర వ్యధ చెందుతున్నానని  వివరించారు.  ఇదిలా ఉండగా, కమిషనర్‌కు మేయర్‌ పంపిన నోట్‌ ప్రతి బయటకు ఎలా వెళ్లిందని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. సదరు సదుపాయం సమకూర్చేందుకుగాను నోట్‌ కాపీ ఎవరెవరి దగ్గరకు వెళ్లింది..ఎక్కడ లీకై ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. 

మరోవంక, పాలకమండలి సభ్యుల జీతభత్యాలూ చర్చనీయాంశంగా మారాయి. కార్పొరేటర్లకు నెలకు రూ.6 వేల గౌరవ వేతనం ఉండగా, మేయర్‌కు రూ.50 వేలు, డిప్యూటీ మేయర్‌కు రూ.25 వేలుగా ఉంది. రూ.4 వేల ఫోన్‌బిల్లుతోపాటు కార్పొరేటర్‌ కుటుంబానికి రూ.5 లక్షల వరకు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.

మేయర్, డిప్యూటీ మేయర్లకు వాహనాల సదుపాయంతోపాటు కార్యాలయ ఖర్చులు కూడా చెల్లిస్తున్నారు. తమ గౌరవ వేతనాలు పెంచాల్సిందిగా గత పాలకమండలి నుంచే కార్పొరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇలా ఉండగా, తనను జైల్లో పెట్టిస్తానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బెదిరించిందని, ఆమె నుంచి ప్రాణహాని ఉందని నగర  టీఆర్ఎస్​ నేత చెట్లపల్లి రామ్ చందర్ ఆరోపించారు. బంజారా హిల్స్ లో ఓ కమర్షియల్​ బిల్డింగ్​ నిర్మాణంలో ఉండగా, రాఘవేంద్ర కనస్ట్రక్షన్​అనే సంస్థ నాలాను కబ్జా చేస్తుండగా, స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని 3 నెలల కిందట ఆర్​టీఐ కింద అర్జీని అధికారులకు పెట్టినట్లు ఆయన తెలిపారు. 

దీనిపై మేయర్  కలుగజేసుకొని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తనకు కాల్ చేసిందని, ‘రామ్ చందర్.. నిన్ను జైల్లో పెడతా.. పోలీసులను పంపించి అరెస్ట్ చేయిస్తా..’  అంటూ బెదిరించిందని ఆయన ఆరోపించారు. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు  విజ్ఞప్తి చేశారు.  అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

మరోవంక, కొవిడ్‌ ప్రభావంతో వ్యాపారాలు జరగని దృష్ట్యా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను మాఫీ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఇప్పటికే ఎవరైనా పన్ను చెల్లిస్తే 2021-22 సంవత్సరంలో మినహాయింపు ఇవ్వాలన్నారు