చైనాను కట్టడి చేసేందుకు క్వాడ్ దేశాధినేతల సమావేశం

ఇండో-పసిఫిక్ రీజియన్‌లో పెరుగుతున్న చైనా పలుకుబడిని కట్టడి చేసేందుకు క్వాడ్ దేశాలతో చర్చలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ న్యూస్ వెబ్‌సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం, భారత దేశం, ఆస్ట్రేలియా, జపాన్‌లతో చర్చలు జరపాలని బైడెన్ నిర్ణయించారు. 

ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ నెలలోనే జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడి షెడ్యూలులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతో ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భాగస్వామ్యాలు, కూటములకుగల ప్రాధాన్యాన్ని అమెరికా వెల్లడించినట్లయింది. క్వాడ్‌లోని స‌భ్య‌దేశాలైన అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, ఇండియా త్వ‌ర‌లో భేటీకానున్న‌ట్లు ఇవాళ ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ ప్ర‌క‌టించారు. 

దేశాధినేతలతో బైడెన్ వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ, వీరందరితో ఒకేసారి సమావేశం నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ కూటమి మరింత బలపడుతుందని భావిస్తున్నారని చెప్తున్నారు. 

ఇటీవ‌ల డ్రాగ‌న్ దేశంతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు క‌య్యానికి దిగాయి.  ప‌లు ద్వైపాక్షిక‌, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలు విభేదాలు వ్య‌క్తం చేశాయి. ఇటీవ‌ల స‌రిహ‌ద్దు అంశంలో భార‌త్‌తోనూ చైనా త‌గాదాకు దిగిన విష‌యం తెలిసిందే.  ఈ పరిణామాల దృష్ట్యా క్వాడ్ దేశాధినేతల సమావేశం ప్రాధాన్యత సంతరింప చేసుకోనుంది. !

గత నెలలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ మీట్ జరిగింది. జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతూ  క్వాడ్ ద్వారా పటిష్టమైన ప్రాంతీయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ మీట్‌లో చైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు.

తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. భారత దేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ దేశాలుగా ఏర్పడ్డాయి. దీనిని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)కు ఆసియా రూపంగా పరిగణిస్తున్నారు.