అమెరికాపై పట్టుసాధిస్తున్న భారత్ సంతతి 

అగ్రరాజ్యం అమెరికాపై భారత సంతతి పట్టు సాధిస్తున్నదని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసాపూర్వకంగా వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వ యంత్రాంగంలో గణనీయ సంఖ్యలో భారత సంతతి నిపుణులకు చోటు దక్కడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 50 రోజులలోపే దాదాపు 57 మంది ఇండియన్‌ అమెరికన్లకు బైడెన్‌ తన యంత్రాంగంలో కీలక నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. వారిలో సగం మంది మహిళలే. గత నెల 18న అమెరికాకు చెందిన పెర్సవరెన్స్‌ రోవర్‌ విజయవంతంగా మార్స్‌పై అడుగుపెట్టిన నేపథ్యంలో మార్స్‌ మిషన్‌ గైడెన్స్‌, కంట్రోల్‌ ఆపరేషన్స్‌కు భారత సంతతికి చెందిన స్వాతిమోహన్‌ నేతృత్వం వహించడాన్ని బైడెన్‌ ప్రముఖంగా ప్రస్తావించారు.

‘అమెరికాపై భారత సంతతి వ్యక్తుల పట్టు పెరుగుతున్నది. మీరు (స్వాతిమోహన్‌), దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, నా ప్రసంగ రచయిత వినయ్‌రెడ్డి అందరూ ఇండియన్‌ అమెరికన్లే. మీరు అద్భుతం’ అని ప్రశంసించారు. అమెరికా చరిత్రలో ఇప్పటివరకూ ఒబామా హయాంలో అత్యధిక మంది భారతీయ అమెరికన్లకు ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి. 

2009-17 మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన ఒబామా కూడా భారతీయులకు అత్యధిక అవకాశాలిచ్చి ఆ రోజుల్లో రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ట్రంప్‌ అధికారానికి వచ్చాక శ్వేతసౌధంలో భారతీయుల సంఖ్య కాస్త తగ్గినా(36 మంది) ప్రభ తగ్గలేదు.

భారతీయ మహిళ నిక్కీ హ్యాలీకి ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో అమెరికా తరఫున అవకాశం ఇచ్చి, భారతీయులకు కేబినెట్‌ ర్యాంక్‌ కల్పించిన తొలి అధ్యక్షుడు అయ్యారు. బైడెన్‌ వచ్చాక డాక్టర్‌ వివేక్‌ మూర్తినిఅమెరికా సర్జన్‌ జనరల్‌గా నియమించారు. న్యాయవాది వనితా మూర్తి అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ఖరారు అయ్యారు.

దీనిని కొనసాగిస్తూ బైడెన్‌ సర్కారు తక్కువ రోజుల్లోనే అత్యధిక మందికి కీలక బాధ్యతలు అప్పగించింది. వీరిలో సగం మంది మహిళలే కావడం విశేషం. మార్స్‌ ప్రయోగం విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలను బైడెన్‌ అభినందించారు. సైంటిఫిక్‌ లీడర్‌గా అమెరికా ప్రతిష్ఠ మసకబారుతున్న తరుణంలో ఈ విజయం గొప్ప విశ్వాసాన్ని అందించిందని చెప్పారు.

అమెరికా అగ్రశ్రేణి ఐటీ సంస్థలైన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌లకు భారతీయులైన సత్య నాదెండ్ల, సుందర్‌ పిచాయ్‌లు నేతృత్వం వహిస్తున్నారు. 1990 తర్వాత డజన్ల సంఖ్యలో భారతీయులు అమెరికన్‌ సంస్థలకు సీఈవోలు అయ్యారు. కష్టించేతత్వం కలిగిన భారతీయులను ప్రాధాన్యం కలిగిన పదవుల్లోకి తీసుకోవడానికి అక్కడి సంస్థలు ఇష్టపడతాయి. దాదాపు 2 లక్షల మంది భారతీయులు అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు.

అమెరికన్‌ భారతీయులు 30 లక్షల మంది వరకు ఉంటారు. అమెరికా జనాభాలో ఇది ఒక శాతం. 2030 కల్లా రెండు శాతానికి పెరుగుతుందని అంచనా. భారతీయ అమెరికన్లు పెద్ద పెద్ద నగరాల్లో స్వింగ్‌ ఓటర్లుగా మారారు. దాంతో పార్టీలు వీరి ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వక తప్పడం లేదు.

తాజాగా, ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ మొదటి వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా ఇండో అమెరికన్‌ నౌరిన్‌ హసన్‌ నియామకమయ్యారు. 

కీలక పదవుల్లో ఇండియన్ అమెరికన్లు 

 • కమలాహ్యారిస్‌ – ఉపాధ్యక్షురాలు 
 • వివేక్‌మూర్తి – సర్జన్‌ జనరల్‌ 
 • వనితా గుప్తా – అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ 
 • వినయ్‌రెడ్డి – బైడెన్‌ ప్రసంగ రచయిత  
 • ఉజ్రాజయ – అండర్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ సివిలియన్‌ సెక్యూరిటీ, డెమోక్రసీ, హ్యూమన్‌రైట్స్‌ 
 • భరత్‌ రామమూర్తి -జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌ 
 • గౌతమ్‌ రాఘవన్‌ – అధ్యక్ష కార్యాలయ సిబ్బంది డిప్యూటీ డైరెక్టర్‌ 
 • మాలా అడిగి -బైడెన్‌ భార్య జిల్‌కు విధాన సలహాదారు 
 • గరిమా వర్మ – జిల్‌ బైడెన్‌కు డిజిటల్‌ డైరెక్టర్‌ 
 • తరుణ్‌ చాబ్రా – టెక్నాలజీ, నేషనల్‌ సెక్యూరిటీ సీనియర్‌ డైరెక్టర్‌ 
 • సుమన గుహ -దక్షిణాసియా, జాతీయ భద్రతా మండలి సీనియర్‌ డైరెక్టర్‌ 
 • శాంతి కళాతిల్‌ – ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోఆర్డినేటర్‌ 
 • సోనియా అగర్వాల్‌ – పర్యావరణ విధాన సలహాదారు 
 • సబ్రినా సింగ్‌ – ఉపాధ్యక్షురాలికి డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ 
 • అయేషా షా -వైట్‌హౌస్‌ డిజిటల్‌ స్ట్రాటజీ పార్ట్‌నర్‌షిప్‌ మేనేజర్‌ 
 • సమీరా ఫాజిల్‌ -జాతీయ ఆర్థికమండలి డిప్యూటీ డైరెక్టర్‌ 
 • వేదాంత్‌ పటేల్‌ – అసిస్టెంట్‌ ప్రెస్‌ సెక్రటరీ 
 • విదుర్‌ శర్మ – కొవిడ్‌ టెస్టింగ్‌ అడ్వైజర్‌ 
 • నేహా గుప్తా – అసోసియేట్‌ కౌన్సెల్‌ 
 • రీమా షా -డిప్యూటీ అసోసియేట్‌ కౌన్సెల్‌
 • రోహిత్‌ చోప్రా – కన్జూమర్‌ ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ బ్యూరో డైరెక్టర్‌