ఐరాస నిర్ణయం భారత్‌కు దక్కిన మరో గౌరవం

తృణ ధాన్యాలకు ప్రజాదరణ కల్పించడంలో ముందు వరుసలో ఉన్నందుకు భారత దేశానికి గౌరవం దక్కిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తూ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ ఓ తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత దేశం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతిచ్చిన దేశాలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ తీర్మానానికి నేపాల్, బంగ్లాదేశ్, కెన్యా, నైజీరియా, రష్యా, సెనెగల్ మద్దతిచ్చాయి. దీనికి 70కి పైగా దేశాలు కో-స్పాన్సర్ చేశాయి. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలను తృణ ధాన్యాలు అంటారు. వీటిలో ఉండే పోషకాలు, కాల్షియం, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల లైఫ్ స్టయిల్ రోగాలను నిరోధించగలవు. వీటిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో భారత దేశం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. మారే వాతావరణ పరిస్థితుల్లో వీటిని సాగు చేయవచ్చునని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

తృణ ధాన్యాలకు ప్రజాదరణ కల్పించడంలో ముందు వరుసలో ఉన్న భారత దేశానికి గౌరవం లభించిందని ప్రధాని ఒక ట్వీట్ లో సంతోషం ప్రకటించారు. తృణ ధాన్యాల వినియోగం వల్ల పోషక విలువలు లభిస్తాయని, ఆహార భద్రత దొరుకుతుందని, రైతుల సంక్షేమానికి దోహదపడుతుందని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, స్టార్టప్ కమ్యూనిటీలు వీటిపై పరిశోధనలు చేసేందుకు అవకాశాలు లభిస్తాయని తెలిపారు.  

ఈ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే మార్చి 3న ఐక్య రాజ్య సమితికి శాశ్వత భారత దేశ ప్రతినిధి తిరుమూర్తి ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్, 2023పై భారత దేశం స్పాన్సర్ చేసిన తీర్మానం ఈ ఉదయం ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడం సంతోషకరం. ఆహార పదార్థాల్లో ముఖ్యమైన భాగంగా తృణ ధాన్యాల వల్ల కలిగే పోషకాహార, పర్యావరణ ప్రయోజనాలను ప్రచారం చేయడంలో గొప్ప ముందడుగు పడింది’’ అని పేర్కొన్నారు. 

ఈ తీర్మానాన్ని బలపరచిన బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్ దేశాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలన్నిటికీ ధన్యవాదాలు తెలిపారు. తృణ ధాన్యాలతో తయారు చేసిన  రుచికరమైన ‘‘మురుకు’’ను ఇండియన్ మిషన్ పంపిణీ చేసిందని, దీనిని సభ్య దేశాల ప్రతినిధులందరూ ఆరగించినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 

భారత దేశానికి 2014లో యోగా దినోత్సవం విషయంలో గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించిన తీర్మానాన్ని 2014లో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ ఆమోదించింది. దీంతో 2015 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.