ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు సహాయం.. ఒప్పుకున్న చైనా!

ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌కు సహాయం.. ఒప్పుకున్న చైనా!
ఆపరేషన్‌ సిందూర్‌లో తాము ఎలాంటి పాత్ర పోషించ లేదంటూ ఇన్నాళ్లూ బుకాయిస్తూ వచ్చిన చైనా తొలిసారిగా నిజం ఒప్పుకుంది. పాక్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్టు చైనా తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (ఏవీఐసీ)కి చెందిన చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంజనీర్లు  జాంగ్ హెంగ్, షూ దా తాజాగా చైనా ప్రభుత్వ టీవీ ఛానల్ సీసీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. 

“గతేడాది ఆపరేషన్ సిందూర్ టైంలో మేం పాకిస్థాన్‌లోని ఎయిర్ బేస్‌లో ఉండి సాంకేతిక సహాయాన్ని అందించాం. అక్కడ యుద్ధ విమానాలు టేకాఫ్ అయ్యే భీకరమైన సౌండ్స్ నిత్యం మాకు వినిపించేవి. ఎడతెరిపి లేకుండా ఎయిర్ రైడ్ సైరన్లు మోగుతుండేవి. అది మే నెల. రోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య టెంపరేచర్ దాదాపు 50 డిగ్రీల సెల్సీయస్‌కు చేరుకునేది. దీంతో ఆ సమయం మాకు మానసికంగా, శారీరకంగా ఒక పెద్ద పరీక్షలా అనిపించేది” అని చైనా ఇంజినీర్‌ జాంగ్ హెంగ్ చెప్పుకొచ్చారు.  తాము తయారు చేసిన యుద్ధ విమానాలు పూర్తి పోరాట సామర్థ్యంతో పనిచేయగలవని నిరూపించాలనే సంకల్పంతో మా బృందం శ్రమించిందని చెప్పారు. 

“నేను కూడా ఆపరేషన్ సిందూర్ టైంలో చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ తరఫున పాకిస్థాన్‌కు వెళ్లాను. అక్కడే ఉంటూ పాక్ వాయుసేనకు సాంకేతికపరమైన మద్దతును అందించాను. మా ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన జే-10సీఈ యుద్ధ విమానం ఆపరేషన్ సిందూర్ టైంలో పెద్ద పరీక్షను ఎదుర్కొంది. జే-10సీఈ యుద్ధ విమానాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయి” అని  చైనా ఇంజినీర్‌ షూ దా పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇచ్చిందనే ఆరోపణలను గతంలో చైనా విదేశాంగ, రక్షణ శాఖల అధికారులు ఖండించడం గానీ, వాటి తీవ్రతను తగ్గించి చూపడం కానీ చేశారు. ఆపరేషన్ సిందూర్‌ను చైనా ఒక లైవ్ ల్యాబ్‌గా ఉపయోగించుకొని పాకిస్థాన్‌కు చురుకైన సైనిక మద్దతును అందించిందని భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్. సింగ్ 2025 జులైలో ఆరోపించారు. 

చైనా శాటిలైట్ల ద్వారా భారత సైనిక మోహరింపుల సమాచారాన్ని సేకరించి పాక్‌కు ఎప్పటికప్పుడు చేరవేసిందని ఆయన తెలిపారు. ఈ ఆరోపణలపై చైనా వైపు నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందనా రాలేదు.  ఈ నిర్ధారణ, రెండు వైపుల నుండి ముప్పు పొంచి ఉందనే భారతదేశపు చిరకాల ఆందోళనలను బలపరుస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చురుకుగా ఉన్న సమయంలో, పాకిస్తాన్ వైమానిక యుద్ధ సామర్థ్యాలను నిలబెట్టడంలో బీజింగ్ ఇప్పుడు ఎలా ప్రత్యక్ష పాత్ర పోషిస్తుందో ఇది స్పష్టం చేస్తుంది.