ఉద్యోగం పోతే తక్షణమే అమెరికాను వీడాల్సిందే!

ఉద్యోగం పోతే తక్షణమే అమెరికాను వీడాల్సిందే!

అమెరికా ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త నిబంధన ప్రకారం హెచ్‌-1బీ వీసాదారులు, ఇతర తాత్కాలిక విదేశీ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రస్తుతం లభిస్తున్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దయ్యే అవకాశం ఉన్నది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగులు తక్షణమే అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. 

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) మినహాయింపు ఇస్తే తప్ప, వారు అమెరికాలో ఉంటూ తమ వీసా హోదాను లేదా ఉద్యోగ యజమానిని మార్చుకోవడం సాధ్యపడదు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ బడ్జెట్‌ పరిశీలనలో ఉన్నది. ఈ సమీక్ష పూర్తయిన తర్వాత ప్రభుత్వం దీనిని ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురిస్తుంది. 

ఈ నిబంధన అమల్లోకి వస్తే, వీసా గడువు ముగిసేలోపే ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు చట్టబద్ధమైన హోదాలో లేనట్టే భావిస్తారు.  ప్రస్తుతం అమల్లో ఉన్న 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ నిబంధనను 2016లో ప్రవేశపెట్టగా 2017 ప్రారంభంలో అమల్లోకి వచ్చింది. ఇది హెచ్‌-1బీ, హెచ్‌-1బీ1, ఎల్‌-1, వో-1, టీఎన్‌, ఈ-1, ఈ-2, ఈ-3 వీసాదారులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు వర్తిస్తుంది. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయినవారు 60 రోజులు లేదా వారి ఐ-94 గడువు ముగిసేవరకు అమెరికాలో ఉండవచ్చు. ఈ సమయంలో వారు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, వీసా స్టేటస్‌ మార్పునకు దరఖాస్తు చేయడం లేదా దేశం విడిచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవడం వంటివి చేయవచ్చు. గ్రేస్‌ పీరియడ్‌ ఉద్యోగం పోయినా లేదా రాజీనామా చేసినా వర్తిస్తుంది.

అయితే, ఈ ప్రతిపాదన ఇంకా ఫెడరల్‌ సమీక్ష దశలోనే ఉన్నది. ఒకవేళ ఇది ఆమోదం పొందితే ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త అవకాశాలు వెతుక్కునే వెసులుబాటు ఉండదు. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికాలో పనిచేస్తున్నవారిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉండటంతో, ఈ ప్రతిపాదిత మార్పు భారతీయ టెక్‌ ఉద్యోగులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నది. 

ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునే సమయం లేకపోవడంతో వారిపై ఒత్తిడి పెరుగుతుంది.  కాగా, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన చాలామంది విద్యార్థులు చదువు పూర్తయ్యాక తిరిగి భారత్‌కు తిరిగి రావాలని భావిస్తున్న విద్యార్థుల సంఖ్య 81 శాతం ఉందని స్టూడెంట్‌ మొబిలిటీ ఇండెక్స్‌ పేరుతో ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన సర్వే వెల్లడించింది. 

సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తమ కుటుంబంలో తామే తొలిసారి విదేశీ విద్యనభ్యసిస్తున్నట్టు తెలుపగా, ఐదుగురు తమ సొంత నిర్ణయంతోనే విదేశాల్లో విద్యాభ్యాసనకు వచ్చినట్టు తెలిపారు.