ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో ప్రసంగిస్తూ, గాజాలో నెలకొన్న పరిస్థితి “అత్యంత సిగ్గుచేటు” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేర్కొన్నారు. ఈ సంక్షోభం పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించిన తీరును ఆయన ప్రశ్నించారు. “గాజా విషయంలో మనం ఏమీ చేయకుండా ఉంటే మన విశ్వసనీయతకు అర్థం ఏముంటుంది? శాంతి నెలకొందని కొందరు చెబుతున్నారు, కానీ దీనివల్ల మానవతా సాయం అందడం ప్రారంభం కాలేదు. ఈ పరిస్థితి నిజంగా సిగ్గుచేటు,” అని మాక్రాన్ స్పష్టం చేశారు.
గాజాలో శాంతి స్థాపన జరిగిందంటూ చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక వాస్తవాలకు మధ్య పొంతన లేదని విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది పాలస్తీనాను కొన్ని దేశాలు గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా మెక్రాన్ ప్రస్తావించారు.
“ఒక ఏడాది క్రితం ఇదే సభలో డజనుకు పైగా దేశాలు పాలస్తీనాను గుర్తించాయి. ‘గుర్తింపు అనేది కేవలం కాగితం ముక్క మాత్రమే, వాస్తవ పరిస్థితిని చూడండి’ అని కొందరు అంటున్నారు. గాజా విషయంలో మనం నిష్క్రియాపరులుగా ఉంటూ పోతే మనకు ఏపాటి విశ్వసనీయత ఉన్నట్టు? కొందరు తాము శాంతిని సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, ఆ శాంతి ఒక్క సెకను పాటు అయినా మానవతా సహాయాన్ని పునరుద్ధరించలేదు. ఇది మనందరికీ సిగ్గుచేటు. దీన్ని మనం మనం ప్రేక్షకులలా చూస్తూ ఊరుకోవాలా?” అని ప్రశ్నించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల గురించి ప్రస్తావించిన మాక్రాన్, హార్ముజ్ జలసంధిని “బ్లాక్‌మెయిల్” (బెదిరింపు) కోసం ఉపయోగించకూడదని నొక్కి చెప్పారు. ఆ జలమార్గాన్ని తిరిగి తెరవడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఆయన తెలిపారు. ఆ జలసంధి గుండా నౌకల రాకపోకలు సాగడం అందరి ప్రయోజనాలకు అనుకూలమని మాక్రాన్ చెప్పారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం రెండూ ప్రాధాన్యత కలిగిన అంశాలని ఆయన చెప్పారు.
గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్‌లో జరుగుతున్న పరిణామాలపై కూడా మెక్రాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ప్రతిరోజు నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెబుతూ వెస్ట్ బ్యాంక్‌లో హమాస్ ఎప్పుడూ కార్యకలాపాలు సాగించలేదని గుర్తు చేశారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు పాలస్తీనా ప్రజల మనుగడ హక్కును కాలరాసే విధంగా, భవిష్యత్ శాంతి ప్రాతిపదికనే దెబ్బతీసేలా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇజ్రాయెల్ పొరుగు దేశాలపై చేపడుతున్న సైనిక చర్యలు ఆ దేశ భద్రతను మెరుగుపరచవని, పైగా భవిష్యత్తులో దానిని మరింత బలహీనపరుస్తాయని ఆయన హితవు పలికారు. మనం మళ్లీ ‘అడవి చట్టం’ వైపు వెళ్తున్నామా? లేక నాగరిక అంతర్జాతీయ సమాజంలో జీవిస్తున్నామా? అనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

More Stories
ప్రజల నిరసనలతో పాక్ కు రోజుకు 3 వేల కోట్లకు పైగా నష్టం
పార్లమెంట్ లో 450 సీట్లలో 355 సీట్లు గెల్చుకున్న పుతిన్
మోదీ, జిన్పింగ్, పుతిన్ లేకుండానే ఐరాస సమావేశం