పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ను ముట్టడించేందుకు ప్రతిపక్ష పార్టీలు, నిరసనకారులు సిద్ధమవుతుండటంతో ఆదేశంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ సెప్టెంబర్ 27వ తేదీన దేశవ్యాప్త నిరసనలతో ఇస్లామాబాద్ వైపు లాంగ్ మార్చ్‌కు పిలుపునిచ్చింది.
మరోవైపు పెట్రోలియం లేవీ పెంపును వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ (జేఐ) పార్టీ ఆగస్టు 16వ తేదీ నుంచి ఆందోళనలు చేపడుతూ రాజధాని వైపు దూసుకొస్తోంది. ఈ నిరసనల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని, రోడ్ల దిగ్బంధం వల్ల ప్రతిరోజూ సుమారు 400 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.38,33,81,20,000) భారీ నష్టం వాటిల్లుతుందని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
పట్టణాల్లో రాకపోకలకు భంగం కలిగించవద్దని, ప్రజా రహదారులను అడ్డుకోవద్దని ఇస్లామాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అల్లావుల్లా తరార్ కీలక ప్రకటన చేశారు. రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ గుంపునూ నగరంలోకి అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధికారులు ఇస్లామాబాద్ ప్రవేశ మార్గాల్లో వందలాది భారీ షిప్పింగ్ కంటైనర్లను అడ్డుగా ఉంచి దారులను మూసివేశారు.
అదనంగా, అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రధాన ఆసుపత్రులైన పిమ్స్ (పీఐఎమ్ఎస్), ఫెడరల్ గవర్నమెంట్ పాలిక్లినిక్‌లలో ఎమర్జెన్సీ, ఐసీయూ, బ్లడ్ బ్యాంక్ సేవలను సెప్టెంబర్ 30 వరకు హై అలర్ట్‌లో ఉంచారు. దేశ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్, ప్లానింగ్ కమిషన్ నివేదికల ఆధారంగా రోజువారీ నష్టాల వివరాలను వెల్లడించారు.
నిరసనల వల్ల సేవా రంగం (ఆర్థిక, రవాణా, కమ్యూనికేషన్, రిటైల్, ఆతిథ్య రంగాలు) ఏకంగా 86 బిలియన్ రూపాయల నష్టాన్ని చవిచూస్తుందని, పారిశ్రామిక రంగం 25 బిలియన్లు, వ్యవసాయ రంగం 9 బిలియన్ రూపాయలు నష్టపోతాయని అంచనా వేశారు. దీనికి తోడు ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాబడిలో మరో 17 బిలియన్ రూపాయల కోత పడుతుందని తెలిపారు.
ఇప్పటికే హార్మూజ్, బాబ్ అల్-మందేబ్ జలసంధుల్లో అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల రవాణా, ఇన్సూరెన్స్ వ్యయం పెరిగి సఫలమవుతున్న వ్యాపార రంగానికి ఈ నిరసనలు మరింత దెబ్బగా మారతాయని హెచ్చరించారు. అంతేకాకుండా జులై, ఆగస్టు కాలంలో నమోదైన 811 మిలియన్ డాలర్ల ఐటీ ఎగుమతులపై కూడా ప్రభావం పడుతుందని, ఇంటర్నెట్ నిలిపివేతలతో ఐటీ రంగం దాదాపు 80 శాతం దెబ్బతినే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇస్లామాబాద్‌ను “సోమనాథ్”లా మారుస్తామంటూ పీటీఐ సీనియర్ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్ ఫజల్ చౌదరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

More Stories
పార్లమెంట్ లో 450 సీట్లలో 355 సీట్లు గెల్చుకున్న పుతిన్
మోదీ, జిన్‌పింగ్, పుతిన్ లేకుండానే ఐరాస సమావేశం
ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం, విదేశీయులపై పరిమితులు