ఐరోపా దేశాల ద్వంద విధానాలను ఎండగట్టిన జైశంకర్  

ఐరోపా దేశాల ద్వంద విధానాలను ఎండగట్టిన జైశంకర్  

రష్యా ముడి చమురును కొనుగోలు చేయడంపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తిప్పికొట్టారు. రష్యా చమురును కొంటున్నందుకు ప్రశ్నిస్తున్న ఆ దేశాలు భారత్‌ పొరుగు దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు అనేక ఏళ్లుగా ఆయుధాలను విక్రయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఫిన్లాండ్‌లో జరిగిన కుల్తారంత చర్చల సందర్భంగా ‘వర్ధమాన శక్తులు, నూతన భౌగోళిక రాజకీయ పోటీ’ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొంటూ  “భారత ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడి జరగలేదు. భారతదేశానికి సంబంధించి ఐరోపా ఆయుధాల విషయంలో కూడా నేను అలా చెప్పగలిగితే బాగుండేది,” అని ఆయన ఐరోపా దేశాలను నిలదీశారు. 
 
 “ఐరోపా ఆయుధాలను అమ్ముతోంది. వాటిని భారతదేశంపై దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇది కేవలం ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. మేము భారతీయులం ఐరోపాకు ప్రమాదం కలిగించే ఏ పనీ ఎప్పుడూ చేయలేదు” అని తెలిపారు.  రష్యా చమురు కొనుగోలుపై ఐరోపా చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ  2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా చమురును కొనుగోలు చేయాలన్న భారతదేశ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. 
దేశ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా భారతదేశం తన ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.  “నేను రెండు విషయాలు గమనించాను. నేను చమురును దాని ధర,  లభ్యత ఆధారంగా కొనుగోలు చేస్తాను. కాబట్టి ఆ సమయంలో, మార్కెట్లో అందుబాటులో ఉన్న చమురులో ఎక్కువ భాగం రష్యాదే. ఎందుకంటే యూరోపియన్లు ప్రధానంగా మధ్యప్రాచ్యం నుండి చమురును కొనుగోలు చేసేవారు, అదే మనకు సాంప్రదాయ సరఫరాదారు. కాబట్టి పరిస్థితులు మనల్ని ఒక నిర్దిష్ట దిశగా నెట్టాయి,” అని జైశంకర్ పేర్కొన్నారు. 
 
భారతదేశ ఇంధన అవసరాల గురించి ఆయన మాట్లాడుతూ, “ప్రపంచ ఆర్థిక సమతుల్యత”ను కాపాడుకోవడానికి రష్యా చమురును కొనుగోలు చేయమని భారతదేశాన్ని ప్రోత్సహించింది అమెరికానే అని గుర్తుచేశారు. “ఆ సమయంలో, చమురు మార్కెట్‌ను స్థిరీకరించడానికి రష్యా చమురును కొనుగోలు చేయమని అమెరికా నేరుగా భారతదేశాన్ని కోరింది. మేము ధర, లభ్యత ఆధారంగా చమురును కొనుగోలు చేస్తాము,” అని ఆయన తెలిపారు.
“ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తే, రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు మొదట మాపై సుంకాలు విధించిన అమెరికా, ఆ తర్వాత మళ్లీ ఆ ఆంక్షలను ఎత్తివేసింది… కాబట్టి, ఇందులో ఏదో గొప్ప నైతిక సూత్రం ఇమిడి ఉందని నటించాల్సిన అవసరం లేదు. దీన్ని నైతికతకు సంబంధించిన అంశంగా మార్చడం సమంజసమని నేను భావించడం లేదు” అంటూ విమర్శించారు.