రాష్ట్రపతితో సహా పలువురు ప్రముఖులకు టీకా 

దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.  మొదటి దశలో  ఫ్రంట్‌లైన్, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ను అందించగా, రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.  

ఈ నేపథ్యంలో  వరుసగా మూడో  రోజు పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్‌ తొలిడోస్‌ను స్వీకరించారు. ముఖ్యంగా  రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌,  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్, ‌మేఘాలయ గవర్నర సత్యపాల్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అతని భార్య లక్ష్మి  సహా, ఇతర రాజకీయ ప్రముఖులు వాక్సిన్‌  అందుకున్నారు. 

అలాగే  క్రికెట్‌ దిగ్గజం భారత మాజీ కెప్టెన్‌ కపిల్ ‌దేవ్‌, ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే, సీనీ రంగ ప్రముఖుడు చారుహాసన్‌, కూడా కరోనా టీకాను స్వీకరించడం గమనార్హం. మరోవైపు సీరం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీరంసీఈవో భార్య నటాషా పూనావాలా మంగళవారం వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

కాగా, కోవిడ్ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ను మరింత వేగవంతం చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇంతవరకూ నిర్దిష్ట వేళల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తుండగా, ఆ ఆంక్షలను కేంద్రం తొలగించింది. రోజంతా ఎప్పుడైనా (24×7) వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ బుధవారంనాడు తెలిపారు.

 ‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. వ్యాకినేషన్‌‌ కోసం నిర్దిష్ట వేళలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నాం. ప్రజలు రోజులో ఎప్పుడైనా సరే తమకు వీలున్న సమయంలో వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు’ అని హర్షవర్ధన్ ఓ ట్వీట్‌లో తెలియజేశారు. ప్రజల ఆరోగ్యంతో పాటు వారి విలువైన సమయం గురించి ప్రధాని మోదీకి బాగా తెలుసునని చెప్పారు. ప్రస్తుతం, కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 1న తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. రెండో రోజైన సోమవారంనాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, నటుడు-రాజకీయనేత కమల్‌హాసన్, కేరళ ఆరోగ్ మంత్రి కేకే శైలజా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచంద్రన్త దితర ప్రముఖులు వ్యాక్సిన్ తొలి డోసు  తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు రాగానే ఎలాంటి సంకోచాలు లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని హర్షవర్ధన్ పిలుపునిచ్చారు.