కర్ణాటక మంత్రి ర‌మేశ్ జార్కోలీ రాజీనామా 

క‌ర్నాట‌క‌కు చెందిన జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి ర‌మేశ్ జార్కోలీ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఓ మ‌హిళ‌తో శృంగార‌భ‌రిత సంభాష‌ణ‌లు చేసిన మంత్రి టేపు ఒక‌టి మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. నైతిక బాధ్య‌త‌తో త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు మంత్రి ర‌మేశ్ తెలిపారు.  

త‌న రాజీనామా లేఖ‌ను ముఖ్యమంత్రి యడియూరప్పకు పంపగా.. ఆయన గవర్నర్ వాజుభాయ్ వాలా ఆమోదం కోసం పంపారు. గవర్నర్ వెంటనే  ఆమోదం తెలిపారు.  త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు నిజం కాదు అని, నిష్ప‌క్ష‌పాతంగా విచార‌ణ జ‌ర‌గాల‌ని ఆయన కోరారు. తాను  నిర్దోషిన‌ని, అందుకే నైతిక బాధ్య‌త వ‌హిస్తూ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని ఆయ‌న సీఎంను కోరారు.   

ప్ర‌భుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ మ‌హిళ‌ను మంత్రి రెచ్చ‌గొట్టార‌ని, లైంగిక కోర్కెలు తీర్చాలంటూ ఆ మ‌హిళ‌తో మంత్రి సంభాషించిన‌ట్లు వీడియోలో ఉంది.  అస‌భ్య‌క‌ర భంగిమ‌ల్లో ఆ మ‌హిళ‌తో మంత్రి ఉన్న ఫోటోల‌ను కూడా క‌న్న‌డ టీవీ ఛాన‌ళ్లు ప్ర‌సారం చేశాయి.  

ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ర‌హ‌స్య సంభాష‌ణ‌కు సంబంధించిన ఆడియో కూడా ఒక‌టి విడుదలైంది. ఉద్యోగం ఇస్తాన‌ని ఆశ చూపుతో మంత్రి మాట్లాడార‌ని, క‌ర్నాట‌క భ‌వ‌న్ నుంచి మాట్లాడుతున్న నేప‌థ్యంలో నెమ్మ‌దిగా మాట్లాడాలంటూ ఆ మ‌హిళ‌తో మంత్రి పేర్కొన్న ఆడియోను విడుదల  చేశారు. 

ఈ వీడియోను దినేశ్‌ కల్లహళ్లీ అనే సామాజిక కార్యకర్త బెంగళూరు మీడియాకు విడుదల చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఆడియో క్లిప్ ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న దానిపై స్ప‌ష్ట‌త లేదు.