కేరళలో ‘ఇస్లాం ఫ్రెండ్లీ జిమ్’ ప్రకటనపై దుమారం

కేరళలో ‘ఇస్లాం ఫ్రెండ్లీ జిమ్’ ప్రకటనపై దుమారం
కేరళలోని పాలక్కాడ్ జిల్లా పుతునగరంలో ఒక ప్రైవేట్ వ్యాయామశాల యాజమాన్యం గత 15 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న జిమ్‌ను ఇకపై పూర్తిగా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం నడిచే ఒక ‘ఇస్లాం ఫ్రెండ్లీ జిమ్’గా మార్చబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడం పెద్ద దుమారం రేపింది.  పుతునగరం కేంద్రంగా పనిచేస్తున్న ఈ జిమ్ విడుదల చేసిన ఒక ప్రచార వీడియో తర్వాత ఈ వివాదం తలెత్తింది. 
 
ఆ వీడియోలో యజమాని నవాజ్ ముత్తు టి, తమ జిమ్‌లో పెద్ద శబ్దంతో కూడిన సంగీతాన్ని నివారించడం ద్వారా నిశ్శబ్ద వాతావరణాన్ని నిర్వహిస్తామని, అలాగే పురుషులు, మహిళలకు వేర్వేరు వ్యాయామ ప్రదేశాలు, షెడ్యూళ్లను అందిస్తామని ప్రకటించారు. సభ్యులకు అనుగుణంగా, జిమ్‌లో లింగ-విభజనతో కూడిన శిక్షకులను కూడా అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
 
ఈ విధమైన విధానంతో ఏర్పాటు కాబోతున్న కేరళలోనే మొట్టమొదటి జిమ్ ఇదేనని నిర్వాహకులు పేర్కొన్న ప్రకటన సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో కలకలం చెలరేగింది.  కేరళలో తాజాగా ఏర్పడిన ప్రభుత్వంలో ముస్లిం లీగ్‌కు గణనీయమైన రాజకీయ ప్రాబల్యం ఉండడంతో  తమ జిమ్ ‘షరియా చట్టాల’ ఆధారంగా పనిచేస్తుందని పేర్కొనడం తీవ్రమైన చర్చకు దారితీసింది. 
 
ఈ సరికొత్త ఇస్లామిక్ వ్యాయామశాలలో ప్రధానంగా మూడు నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు సదరు పోస్ట్‌లో పేర్కొన్నారు. జిమ్ లోపల ఎలాంటి పాటలు లేదా సంగీతాన్ని ప్లే చేయడానికి అనుమతించరని చెప్పారు. అలాగే ఇస్లామిక్ నిబంధనల ప్రకారం శరీరంలో ఏ భాగాలైతే బయటకు కనిపించకూడదో వాటిని వ్యాయామం చేసే సమయంలో తప్పనిసరిగా కప్పి ఉంచాలని పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా మహిళా సభ్యులు హిజాబ్ ధరించడంతో పాటు ఒళ్లంతా కప్పేసే దుస్తులను ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా పురుషులు, మహిళలు కలిసి ఒకే సమయంలో వర్కవుట్ చేయడానికి వీళ్లేదని నిబంధన పెట్టారు. ఇద్దరికీ పూర్తిగా వేర్వేరు సమయాలను కేటాయిస్తూ జిమ్ యాజమాన్యం ప్రత్యేక షెడ్యూల్‌ను రూపొందించింది. 
 
ఆ వీడియోపై తదనంతరం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ కేంద్రం అందించే సేవలు కేవలం ముస్లింల కోసమే ఉద్దేశించినవా? అని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు సందేహాలు లేవనెత్తారు. ఈ విమర్శలకు స్పందనగా, ఆ అసలు ప్రచార వీడియోను తొలగించారు. ఆ తర్వాత విడుదల చేసిన మరో వీడియోలో, ఆ కేంద్రం  జిమ్ నియమ నిబంధనలను పాటించే పక్షంలో అన్ని మతాలకు చెందిన వారిని సాదరంగా ఆహ్వానిస్తుందని, అది ఎప్పుడూ ముస్లింలకు మాత్రమే పరిమితం కాదని నవాజ్ వివరణ ఇచ్చారు. 
 
కొన్ని సంవత్సరాల క్రితం, పిఎఫ్ఐ, ఎన్డిఎఫ్ వంటి నిషేధిత సంస్థలు జిమ్‌లలో ఆయుధ శిక్షణ నిర్వహించాయని ఆరోపిస్తూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేపట్టినప్పటి నుండి, బహిరంగ ప్రదేశాల్లో మహిళల సంచారంపై ఆంక్షలు క్రమంగా పెరుగుతున్నాయి.  ఇటువంటి పరిణామాలు కూడా అటువంటి సామాజిక ధోరణినే ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు భావిస్తున్నారు. 
 
కేరళలో ఇస్లామిస్టులు తమ పట్టును మరింత బిగిస్తున్నారని ఈ తాజా పరిణామం సూచిస్తోందని వారు వాదిస్తున్నారు. ఈ వినూత్న మార్పులకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.   అయితే, ఈ కేంద్రం కేవలం సాధారణ శారీరక వ్యాయామాలకే పరిమితం అవుతుందా? లేక భవిష్యత్తులో ఇతర రకాల ప్రత్యేక శిక్షణలను ఏమైనా ప్రవేశ పెడుతుందా? అనే కోణంలో కొన్ని వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.