
బెంగాల్‌లో అబ్బాస్ సిద్దిఖీ అనే ముస్లిం మత పెద్ద ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) అనే పార్టీతో పరోక్షంగానూ, అసొంలో మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ 2005లో ప్రారంభించిన ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్)తో ప్రత్యక్షంగానూ కాంగ్రెస్ ఎన్నికల పొత్తు కుదుర్చుకుంది.
దీనిపై అధిష్టానం మీద తిరుగుబాటు చేసిన జీ-23 నేతల్లో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఈ పొత్తులను ప్రశ్నిస్తూ బహిరంగంగానే పార్టీ నాయకత్వాన్ని ఇరకాటంలో పడవేశారు. మూడ్రోజుల కిందట కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో లెఫ్ట్- కాంగ్రెస్ కూటమి ఓ భారీ ర్యాలీ నిర్వహించింది. సీతారాం ఏచూరి, డి రాజాలతో పాటు బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధురి పాల్గొన్న ఈ సభలో అబ్బాస్ సిద్దిఖీ కూడా పాల్గొన్నారు.
ఆయన నాయకత్వంలో ఏర్పడ్డ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎ్‌సఎఫ్) అనే పార్టీతో కాంగ్రెస్ నేరుగా జట్టుకట్టలేదు గానీ వామపక్షాలు మాత్రం తమ కోటా సీట్లలో కొన్నింటిని ఆ కొత్త పార్టీకి కేటాయించాయి. సీపీఎం పొత్తు పెట్టుకుందంటే కాంగ్రెస్ కూడా ఐఎ్‌సఎ్‌ఫతో అవగాహనకు వచ్చినట్లేనని ఆనంద్ శర్మ విమర్శించారు.
‘మతతత్వంపై పోరాడే విషయంలో రకరకాలుగా పార్టీ వ్యవహరించరాదు. మతతత్వం ఏ రూపేణా ఉన్నా మనం ప్రతిఘటించాల్సిందే. అబ్బాస్ సిద్ధిఖితో వేదిక పంచుకోవడం సిగ్గుచేటు’ అని ఆయన దుయ్యబట్టారు. ఈ అంశంపై ముందుగానే వర్కింగ్ కమిటీలో చర్చించి ఉండాల్సిందని స్పష్టం చేశారు.
దీనిపై అధీర్ రంజన్ చౌధురి మండిపడుతూ ‘‘కొంతమంది కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత సౌఖ్యాలు చూసుకున్నారు. ఇప్పటికే వారికి పార్టీనుంచి దక్కాల్సిందల్లా లభించేసింది. ఇపుడు ప్రధాని నరేంద్ర మోదీని పొగడడం మొదలెట్టారు. మొదట ఆయనను స్తుతించడం ఆపాలి. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టాలి. నీడనిచ్చి రాజకీయ జీవితాన్ని అందించిన పార్టీని దెబ్బతీయాలనుకోవద్దు’ అంటూ హితవు చెప్పారు.
అసోంలో మతతత్వ పార్టీగా ముద్రపడ్డ ఏఐయూడీఎ్‌ఫతో పొత్తు ఎలా పెట్టుకుంటారని అక్కడ మంగళవారంనాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మీడియా ప్రశ్నించింది. ‘సిద్ధాంతాలు వేరుకావొచ్చు. మేం పొత్తు పెట్టుకున్న పార్టీల అభిప్రాయాలతో మేం 100 శాతం ఏకీభవించకపోవచ్చు. కానీ ఒక ఉమ్మడి లక్ష్యం కోసం చేసే పనిలో భాగస్వాములమయ్యాం’ అని ఆమె దాటవేత వైఖరి ఆవలంభించారు.
అయితే ఆనంద్‌శర్మ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడుతున్నట్లు మంగళవారం రాత్రి స్పష్టం చేశారు. ‘నా ఆందోళనను వ్యక్తపరిచానంతే… దీనికి నేనెల్లపుడూ కట్టుబడే ఉన్నాను. ఉంటాను. నాపై అధీర్ వ్యక్తిగత దాడి దురదృష్టకరం’ అన్నారాయన. కాగా- కాంగ్రె్‌సలో రేగిన చిచ్చును రాజకీయంగా బిజెపికి సానుకూలముగా మారే అవకాశాలున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. తటస్థంగా ఉన్న వర్గాలు సహితం ఇప్పుడు బీజేపీవైపు మొగ్గుచూపే అవకాశాలు ఏర్పడుతున్నాయి.
“కాంగ్రె్‌సను చూస్తే జాలేస్తోంది. ‘ఒకరేమో లోక్‌సభా పక్ష నేత.. ఇంకొకరు రాజ్యసభలో ఉపనేత. ఈ కాంగ్రెస్ నేతలిద్దరూ బహిరంగంగా కీచులాడుకుంటున్నారు. ఓ మతతత్వ పార్టీ (ఐఎ్‌సఎ్‌ఫ)తో చేతులు కలపడంపై వారిలోనే వారికి భిన్నాభిప్రాయాలు” అంటూ బిజెపి అధికార ప్రతినిధి సంబిట్ పాత్రా విచారం వ్యక్తం చేశారు.
“అధీర్ అంటే మాకు గౌరవం. ఆయన కాంగ్రె్‌సలో ఉండదగ్గ వ్యక్తి కాదు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఆజాద్ లాంటి వ్యక్తులను మందలిస్తారు.. పక్కన పెడతారు. ఇపుడు కాంగ్రెస్ అంటే కేవలం నలుగురే. సోనియా, రాహుల్, ప్రియాంక, రాబర్ట్ వాద్రా… వీరికి సైద్ధాంతిక విలువలు తెలీవు’’ అని ఎద్దేవా చేశారు.
అస్సాంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్ గొగోయ్ ఏఐయూడీఎఫ్ ని మతతత్వ పార్టీ అంటూ చీదరించుకొనేవారు. 2016లో జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఎవ్వరు? అంటూ ప్రశ్నించారు. అయితే గత ఎన్నికలలో బెంగాలీ ముస్లింల మద్దతు సంపాదించే 10 సీట్లు గెల్చుకోగానే ఆ పార్టీ కాంగ్రెస్ కి దగ్గరైనది.
ఆ పార్టీతో ఎటువంటి పొత్తు ఏర్పర్చుకున్నా పరోక్షంగా బిజెపికి సహాయం చేయడమే అంటూ మొన్నటి వరకు అస్సాంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరు అంటూ వచ్చారు. అయితే ఆ పార్టీతో కాంగ్రెస్ నేతలు చాలాకాలంగా తెరచాటు పొత్తులు పెట్టుకొంటూ వస్తున్నారని, ఇప్పుడు తెరపైకి రావడమే తేడా అని బిజెపి నేతలు విమర్శింస్తున్నారు. ఉదాహరణకు, 2019 లోక్ సభ ఎన్నికలలో తరుణ్ గొగాయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ పై ఆ పార్టీ అభ్యర్థిని పెట్టలేదు.
బెంగాల్ లో కాంగ్రెస్ నేతలతో ఐఎఫ్ ఎఫ్ నేతలు వేదిక పంచుకొంటుండగా, ఆ పార్టీ కార్యకర్త ఒకరి ఇంటిలో 24 పరాగణాల జిల్లాలో పోలీసులు పెద్ద ఎత్తున బాంబు తయారీ సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం కాంగ్రెస్, సిపిఎం నేతలను ఇరకాటంలో పడవేస్తున్నది.
More Stories
ఉస్మానియాలో ఆందోళనలను నిషేధిస్తూ ఆదేశాలు
వియత్నాంపై రాహుల్ కు అంత ప్రేమ ఎందుకో?
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం బ్రేక్ – రీ సర్వేకు ఆదేశం