టీకాలకు భారీ స్పందన …. ఇక అన్ని ప్రైవేట్‌ దవాఖానల్లో!

దేశంలోని అన్ని ప్రైవేట్‌ దవాఖానలనూ వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా వినియోగించుకోవచ్చని రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆయుష్మాన్‌ భారత్‌, సీజీహెచ్‌ఎస్‌ వంటి కేంద్ర పథకాలు, రాష్ట్ర బీమా పథకాల పరిధిలోకి రాని దవాఖానలను కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. 
 
దేశంలో రెండవ దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు భారీ స్పందన వస్తుంది. ఇప్పటి వరకు 50 లక్షల మంది లబ్ధిదారులు టీకా తీసుకునేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా..ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. అదేవిధంగా పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ వేసే చోట రద్దీ ఎక్కువగా ఉండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. 
 
అన్ని ప్రైవేటు ఆసుపత్రులను వ్యాక్సినేషన్‌కు వినియోగించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ రద్దీని తగ్గించేందుకు టీకా ప్రక్రియ సమయాన్ని పొడిగించుకునేందుకు సదరు రాష్ట్రాలను సంప్రదిచవచ్చునని ఆసుపత్రులతో పేర్కొంది. సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిమితం చేయడం తప్పనిసరి కాదని చెప్పింది. 
 
అదేవిధంగా వ్యాక్సినేషన్‌ దరఖాస్తు గడువును ప్రస్తుతమున్న వారం కాకుండా… 15 నుండి 30 రోజులకు పెంచే అవకాశాన్ని పరిశీలించాలని ఆసుపత్రులను, రాష్ట్రాలను కోరింది. మంగళవారం రాత్రి 7 గంటల సమయానికి 4,95,001 మందికి తొలి డోస్‌ ఇచ్చినట్టు కేంద్రం తెలిపింది. తొలి రెండు విడుతలను కలుపుకొని మొత్తంగా ఇప్పటివరకు 1,54,61,864 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్టు వెల్లడించింది.
 
సోమవారం నుండి ప్రారంభమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు దాటిన వారికి టీకాలు అందిస్తున్నారు. ఇందు కోసం ఆయుష్మాన్‌ భారత్‌ కింద 10 వేల ప్రైవేటు ఆసుపత్రులు, సెంట్రల్‌ గవర్నమెంట్‌ హెల్త్‌ స్కీం (సిజిహెచ్‌ఎస్‌) 600 ఆసుపత్రుల్లో, రాష్ట్ర ఆరోగ్య బీమా కేంద్రాలను టీకా సెంటర్లుగా వినియోగిస్తున్నారు. 
 
అయితే ఇప్పుడు రద్దీ దృష్ట్యా… ఇంతకు ముందు జాబితా చేయని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని రాష్ట్రాలకు సూచించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ నేతృత్వంలోని నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
మొన్నటి వరకు 16వేలకుపైగా నమోదైన కేసులు  మంగళవారం 12వేల్లోపు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 14,989 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,11,39,516కు పెరిగింది. తాజాగా 13,123 కోలుకోగా.. ఇప్పటి వరకు 1,08,12,044 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్రం తెలిపింది. మరో 98 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది.