గుజరాత్ జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ సహా ఇతర పక్షాలన్నిటినీ తుడిచిపెట్టి, తనకు రాష్ట్రంలో తిరుగులేదని నిరూపించింది. మొత్తం 31 జిల్లా పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అన్నిటిలోనూ ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది.
గుజరాత్‌లోని 81 మునిసిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. బీజేపీ 31 జిల్లా పంచాయతీల్లో విజయం సాధించింది.
2015లో జరిగిన ఎన్నికల్లో ఏడు జిల్లా పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోగా, రెండిటిలో ఇతరులు గెలిచారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర పక్షాలన్నీ పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. పంచమహల్ జిల్లాలో కాంగ్రెస్ కనీసం ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ కనీసం 10 మంది అభ్యర్థులను గెలిపించుకోలేకపోయిన జిల్లాలు 29 ఉన్నాయి.
ఇక 81 నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికలలో బిజెపి 75 నగర పాలక సంస్థలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ కేవలం 4 మాత్రమే గెలుపొందింది. ఇతరులు మరో రెండింటిని గెల్చుకున్నారు.
81 నగర పాలక సంస్థల్లో 8,474 వార్డులలో కొన్ని ఏకగ్రీవం కావడంతో 8,235 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మంగళవారం ఓట్ల లెక్కింపులో తాజా సమాచారం ప్రకారం, 2027 నగర పాలక సంస్థల వార్డుల్లోనూ, 771జిల్లా పంచాయతీల వార్డుల్లోనూ, తాలూకా పంచాయతీ లలో 3236 వార్డ్ లను బిజెపి గెల్చుకకొంది.
ఇక కాంగ్రెస్ 375 నగర పాలక సంస్థల వార్డుల్లోనూ, 164 జిల్లా పంచాయతీల వార్డుల్లోనూ, 1201 తాలూకా పంచాయత్ వార్డులలోను గెలిచింది. ఈ ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావదు, కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు పరేష్ ధనాని తమ పదవులకు రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ ట్వీట్‌లో గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్‌లో నగర పాలక సంస్థలు, తాలూకా పంచాయతీలు, జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు సుస్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. బీజేపీని గుజరాతీలు గట్టిగా నమ్ముతున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
అభివృద్ధి, సుపరిపాలన ఎజెండాతో పని చేస్తున్న బీజేపీతోనే తాము ఉన్నామని గుజరాతీలు స్పష్టం చేశారని ప్రధాని కొనియాడారు. బీజేపీకే తమ మద్దతు అని గుజరాతీలు గట్టిగా చెప్పారని చెప్పారు. బీజేపీ పట్ల దృఢమైన నమ్మకాన్ని, అభిమానాన్ని ప్రదర్శిస్తున్న గుజరాతీలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాతీలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, నమ్మకాలకు నిదర్శనంగా నిలిచే బీజేపీ పట్ల నమ్మకం ప్రదర్శించిన గుజరాతీలకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. పార్టీ అభివృద్ధి అజెండాకు మద్దతుగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని ముఖ్యమంత్రి విజయ రూపాని పేర్కొన్నారు.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు