హర్యాణాలో 75% ప్రైవేటు ఉద్యోగాలు స్థానికులకే

ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించేందుకు ఉద్దేశించిన కొత్త చట్టానికి హరియాణా గవర్నర్ తాజాగా ఆమోదముద్ర వేశారు. 

‘హరియాణా రాష్ట్రం యువత ఆనందించాల్సిన రోజు ఇది. ఇకపై రాష్ట్రంలోని ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే లభిస్తాయి. ప్రతి కంపెనీ, సొసైటీ, ట్రస్టులో స్థానిక రిజర్వేషన్ ఉంటుంది’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా  పేర్కొన్నారు.

ప్రైవేటు సంస్థల్లో స్థానిక రిజర్వేషన్ నినాదంతో చౌతాల ఆధ్వర్యంలోని జననాయక్ జనతా పార్టీ ఎన్నికల్లో పాల్గొంది. బేజీపీతో పొత్తుతో ఎన్నికల్లో బరిలోకి దిగి 90 స్థానాలకు గాను 10 స్థానాలను కైవసం చేసుకుంది. 

కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేటు సంస్థల్లో నెలకు రూ. 50 వేల కంటే తక్కువ పారితోషికం లభించే ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. 50 వేలకు తక్కువగా వేతనం పొందే ఉద్యోగుల వివరాలన్ని ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించన కంపెనీలపై ప్రభుత్వం భారీ జరిమానా విధిస్తుంది.

అయితే.. కంపెనీకి వాల్సిన నైపుణ్యాలున్న ఉద్యోగులు స్థానికంగా లభించని పక్షంలో బయటి వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కూడా కంపెనీలకు ఉంది. ఇందుకోసం కంపెనీలు ప్రభుత్వానికి ముందుగా సమాచారం అందించాల్సి ఉంటుంది.