లవ్ జిహాదీలను, గోవధను ప్రోత్సహిస్తున్న మమతా 

లవ్ జిహాదీలను, గోవధను ప్రోత్సహిస్తున్న మమతా 
పశ్చిమ బెంగాల్ లో మమతా బనెర్జీ లవ్ జిహాదీలను అనుమతిస్తూ గోవధను ప్రోత్సహిస్తున్నారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపణలు గుప్పించారు. మంగళవారం రాష్ట్రంలోని మాల్దాలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఎన్నిక ప్రచార ర్యాలీలో పాల్గొంటూ మమతా పాలనపై నిప్పులు చెరిగారు. 
 
సాంస్కృతిక జాతీయవాదం, విప్లవాలకు పురిటి గడ్డగా ఒకప్పుడు దేశాన్ని నడిపించిన బెంగాల్ ఇప్పుడు అరాచకానికి నిలయంగా మారినదని ధ్వజమెత్తారు. జాతీయ గీతం ఈ నెల నుండే వచ్చినదని, దేశంలో మొదటి నోబెల్ బహుమతి బెంగాల్ బిడ్డ రవీంద్రనాథ్ టాగోర్ తెచ్చుకున్నారని యోగి గుర్తు చేశారు. బెంగాల్ ప్రజలకు తమ పూర్వ వైభవం తీసుకు రావడం కోసం బిజెపి నాయకత్వం ధృడ నిశ్చయంతో ప్రజల ముందుకు వస్తున్నదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలకు అతీతంగా పాలన సాగుతోందని దుయ్యబట్టారు.
ఆవుల అపహరణ, లవ్ జిహాదీ లను కట్టడి చేయడంలో మమతా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. `జై శ్రీరామ్’ నినాదంను కూడా అనుమతించడం లేదని అంటూ రాష్ట్ర ప్రజలు ఈ పరిస్థితిని మరెన్నో రోజూ అనుమతిపబోరని స్పష్టం చేశారు.  ‘‘రాష్ట్రంలో పాలన దారుణంగా ఉంది. హిందువుల మనోభావాల్ని మమతా బెనర్జీ ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రభుత్వ విధానాల్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. దుర్గా పూజకు అనుమతి నిరాకరించారు. ఈద్‌కు గోవధను ప్రారంభించారు” అంటూ ఆయన విమర్శల వర్షం కురిపించారు. 
 
కానీ ప్రభుత్వం దీనిపై ఏమీ మాట్లాడటం లేదని, ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే జరుగుతున్నాయని యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ‘జై శ్రీరాం’ అనడాన్ని కూడా ఇష్టపడటం లేదని అంటూ “మేము యూపీలో లవ్ జిహాద్ చట్టం తీసుకువచ్చాం. కానీ బెంగాల్‌లో లోపాయికారి రాజకీయాలు నడుస్తున్నాయి. అందుకే వాళ్లు లవ్ జిహాదీపై చట్టం చేయడం లేదు’’ అని విమర్శించారు. 
 
ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ లో రామసేవకులపై తుపాకీ గుళ్ళు కురిపించే ప్రభుత్వం ఉండేదని, ఇప్పుడా పార్టీ ఏమైందో గుర్తుంచుకోవాలని మమతకు ఆయన చురకలు అంటించారు. ఇప్పుడు మమతా వంతు వచ్చినదని అంటూ ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పాప్మపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే సంకేతం ఇచ్చారు.