పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు!

దేశవ్యాప్తంగా అప్రతిహతంగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరల నుండి  వినియోగదారులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ  భారీ కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 
 
వినియోగదారులపై పన్ను భారాన్ని తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాన్ని కనుగొనటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, చమురు కంపెనీలు, చమురు మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు ప్రారంభించింది. ధరలను స్థిరంగా ఉంచగల మార్గాలను  అన్వేషిస్తున్నామనీ, మార్చి మధ్య నాటికి సమస్యను ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం చమురు రిటైల్ ధరలో పన్నుల వాటానే దాదాపు 60 శాతం దాకా ఉంది.
ఈ నేపథ్యంలోనే చమురుపై ఉన్న పన్నులను తగ్గించేందుకు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, చమురు సంస్థలు, పెట్రోలియం శాఖతో ఆర్థిక శాఖ సంప్రదింపులు చేస్తోంది.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేృత్వంలోని బీజేపీ సర్కార్‌  గత 12 నెలల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ పై పన్నులను పెంచింది. తాజాగా  వినియోగదారులపై భారాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తో్ంది. అంతేకాదు ముడి చమురు ధరలు పెరిగినా, రోజువారీగా ధరలను సమీక్షించే పద్ధతిని ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుకొచ్చిన్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యలు  ఈ అంచనాలకు బలాన్నిస్తు‍న్నాయి. ఇంధనంపై పన్నును ఎప్పుడు తగ్గిస్తామో  చెప్పలేను, కానీ,   పన్ను భారంపై  కేంద్ర, రాష్ట్రాలు చర్చించాలి ఆమె పేర్కొనడం తెలిసిందే.  గత కొద్ది వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరుగుతూ పోతున్నాయి.రోజువారీ పెరుగుదలతో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100కు చేరుతోంది.