20 మంది రైతులపై లుక్ అవుట్ నోటీసులు!

దేశరాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ట్రాక్టర్ ర్యాలీ హింసాయుత ఘటనలకు సంబంధించి పోలీసులు మరో 20 మంది రైతులపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. వీరిలో రైతు నేతలే అధికంగా ఉన్నారు. 
 
దీనికిముందు 40 మంది రైతులపై ఇదే విధమైన నోటీసులు జారీ చేశారు. వీరంతా విదేశాలకు పారిపోయివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎయిర్‌పోర్టుల వద్ద నిఘా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసు కమిషనర్ (నేర విభాగం) మాట్లాడుతూ పోలీసుల విచారణకు హాజరు కావాలంటూ రైతు నేతలకు రెండవసారి నోటీసులు పంపినట్లు తెలిపారు. ఇప్పటికీ పలువురు రైతు నేతలు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ఇదే ఉదంతంలో మరో 15 కేసులు నమోదు చేశారు.
దీంతో ఈ ఘటనలో మొత్తం కేసుల సంఖ్య 95కు చేరింది. వీరిలో 14 మందిని పోలీసులు విచారిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు చోటుచేసుకున్న హింసాయుత ఘటనలకు సంబంధించిన లభ్యమైన ఫొటోలు, వీడియోలు, ఆడియోలు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.