అసెంబ్లీలో‌ దత్తాత్రేయను తోసేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ బండారు దత్తాత్రేయను బడ్జెట్ సమావేశాల సందర్భంగా తిరిగి వెడుతుండగా కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అడ్డుకొని తోసి వేయడంతో ఆయన క్రింద పడ్డారు. 
 
సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సభను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పదే పదే ఆందోళనకు దిగారు. దీంతో ప్రసంగానికి అడ్డుపడిన ప్రతిపక్ష నేతతో సహా నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్‌ చేశారు. 
 
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసంగం అనంతరం దత్తాత్రేయ సభ నుంచి బయటకు వస్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పలువురు ఆయనను అడ్డుకుని తోశారు. ఈ ఘటన అనంతరం ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. బడ్జెట్ సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రాకుండా వారిని సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో కాంగ్రెస్ విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రితో పాటు ఎమ్మెల్యేలు హర్ష వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజడ, వినయ్ కుమార్ ఉన్నారు.
 ఉదయం 11 గంటలకే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వెనువెంటనే విపక్ష కాంగ్రెస్ నేతలు ఒక్కపెట్టున ఆందోళనకు దిగారు. విపక్ష నేత అగ్నిహోత్రి తన సీట్లోంచి లేచి నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితుల మధ్య గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైను మాత్రమే చదవి వినిపించారు.
అనంతరం ఆయన ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌‌, స్పీకర్ విపిన్ పార్మర్‌‌తో కలిసి బయటకు వస్తుండగా స్పీకర్ ఛాంబర్ వద్ద గవర్నర్‌ను నిలువరించేందుకు విపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. సభ తిరిగి సమావేశం కాగానే, గవర్నర్‌ను ఘెరావ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశ చెందడాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోందని ధ్వజమెత్తారు. అనంతరం, ఐదుగురు ఎమ్మెల్యేలను తక్కిన బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ విపిన్ పార్మర్ ప్రకటించారు. ఆయన ఈ ప్రకటన చేసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు.