జీఎస్టీ కిందికి పెట్రోల్‌, డీజిల్‌ తీసుకు రావాల్సిందే 

పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు క‌ళ్లెం వేయాలంటే వాటిని గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) కిందికి తీసుకురావ‌డ‌మే స‌రైన‌ద‌ని అంద‌రూ భావిస్తున్నారు.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ కూడా అదే మాట అంటున్నారు. 
 
పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి  తీసుకురావాలని తాము జీఎస్‌టీ కౌన్సిల్‌కు తరచు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తెస్తే ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. దీనిపై జీఎస్‌టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
 
 అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం వ‌ల్లే ఇక్క‌డ ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని చెబుతూ కొద్ది రోజుల్లో అవి త‌గ్గుతాయ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. పైగా కొవిడ్ కార‌ణంగా ఉత్ప‌త్తి కూడా త‌గ్గ‌డం దీనికి మ‌రో కార‌ణ‌మ‌ని చెప్పారు. రెండు రోజుల విరామం త‌ర్వాత మంగ‌ళ‌వారం మ‌రోసారి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిన విష‌యం తెలిసిందే.