కాంగ్రెస్ ఎమ్యెల్యే ఇంట్లోరూ. 450 కోట్ల అక్రమ నగదు 

 
మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నైలీ డాగాకు చెందిన సొయా ఉత్పత్తుల కంపెనీలకు సంబంధించి రూ. 450 కోట్ల అక్రమ నగదును ఐటి స్వాధీనం చేసుకుంది. ఈనెల 18 నుండి ఈ సోదాలు జరుపుతున్నట్లు ఐటి అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని బేతుల్‌, సత్నా జిల్లాలతో పాటు ముంబయి, కోల్‌కతాలోని 22 ప్రదేశాలలో ఈ దాడులు జరిపారు. 
 
ఈ దాడుల్లో అక్రమ నగదు రూ. 8 కోట్లు, విదేశీ కరెన్సీ రూ. 44 లక్షలు, తొమ్మిది బ్యాంక్‌ లాకర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సోయా ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థలో కీలక సభ్యుల మధ్య రూ. 15 కోట్లకు పైగా అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. 
 
కోల్‌కతాకు చెందిన కొన్ని పేపర్‌ కంపెనీల్లో భారీ ప్రీమియంతో షేర్‌ క్యాపిటల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రూ. 259 కోట్ల ఆదాయం పొందినట్లు , అలాగే మరో కంపెనీకి చెందిన పెట్టుబడులు విక్రయించడం ద్వారా రూ. 90 కోట్లు ఆదాయాన్ని పొందినట్లు రికార్డుల్లో పేర్కొందని ఐటి అధికారులు తెలిపారు. 
 
అలాగే రూ. 52 కోట్లు నష్టం వచ్చినట్లు రికార్డుల్లో పేర్కొన్నారని అన్నారు. ఈ అక్రమ లావాదేవీలకు సంబంధించిన పలు ల్యాప్‌టాప్‌లతో పాటు హార్డ్‌ డ్రైవ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.