బీమా రంగంలో ఆటోమేటిక్ రూట్ కింద 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ నిబంధనలు (రుణేతర సాధనాలు), 2026 (రెండో సవరణ) ప్రకారం, బీమా కంపెనీలు, బ్రోకర్లతో సహా మధ్యవర్తిత్వ సంస్థల్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంటుంది.
అయితే ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)లో మాత్రం ఈ విదేశీ పెట్టుబడుల పరిమితిని 20 శాతంగా ఉంచారు. ఇంతకు ముందు బీమా రంగంలో ఎఫ్డీఐ పరిమితి 74 శాతం మాత్రమే ఉండేది. దానిని ఆటోమేటిక్ రూట్ కింద 100 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం 2025 డిసెంబర్లో పార్లమెంట్ ‘సబ్కా బీమా సబ్కీ రక్ష బిల్లు, 2025’ను ఆమోదించింది. దీనికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో చట్టంగా మారింది.
2026 ఫిబ్రవరిలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐని నోటిఫై చేసింది. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు కచ్చితంగా ‘బీమా చట్టం, 1938’లోని నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే, విదేశీ పెట్టుబడులు స్వీకరించే కంపెనీలు, ఇన్సూరెన్స్ సంబంధిత కార్యకలాపాలు నిర్వహించడానికి, భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) నుంచి అవసరమైన లైసెన్సులు లేదా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి.
అంటే ఇకపై విదేశీ కంపెనీలు భారతీయ బీమా సంస్థల్లో పూర్తిస్థాయి యాజమాన్య హక్కులను పొందే అవకాశం ఉంటుంది. అయితే, సదరు బీమా కంపెనీలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ లాంటి కీలక పదవుల్లో కనీసం ఒక్కరైనా భారతీయ పౌరుడు ఉండాలని నిబంధనలు విధించారు. ఎల్ఐసీ విషయానికి వస్తే, విదేశీ పెట్టుబడులు అనేవి ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, 1956’లోని నిబంధనలకు లోబడి ఉండాలి. అలాగే బీమా చట్టం, 1938లోని సెక్షన్ 43 ప్రకారం ఎల్ఐసీకి వర్తించే ఇతర నిబంధనలను కచ్చితంగా లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో బీమా వ్యాప్తిని పెంచడం, ప్రీమియం ధరలను తగ్గించడం, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ బీమా దిగ్గజాలు నేరుగా భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనివల్ల బీమా రంగంలో పోటీ విపరీతంగా పెరుగుతుంది. కంపెనీల మధ్య పోటీ పెరిగినప్పుడు, కస్టమర్లను ఆకర్షించడానికి సంస్థలు తక్కువ ధరకే మెరుగైన సేవలను అందించాల్సి ఉంటుంది.

More Stories
30 శాతం లాభాలొస్తున్నా పెట్టుబడులు పెట్టని ప్రైవేట్ రంగం
అవినీతి, అధికార దుర్వినియోగం ఉచ్చులో చైనా సైన్యం
ప్రసార భారతి ఛైర్మన్గా ప్రముఖ గీత రచయిత ప్రసూన్ జోషి