తిరిగి చైనా పెట్టుబడులకు ఒకొక్కటిగా ఆమోదం!

చైనా నుంచి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్‌లో మళ్లీ ద్వారాలు తెరుచుకొంటున్నాయి. చైనా ఎఫ్‌డీఐ ప్రతిపాదనలకు దాదాపు తొమ్మిది నెలల నుంచి అనుమతులను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఒక్కో ప్రతిపాదనకు కేస్‌-బై-కేస్‌ పద్ధతిలో (విడివిడిగా) అనుమతులివ్వడం మొదలుపెట్టింది. 
 
వివాదాస్పద సరిహద్దు వద్ద ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు తగ్గడంతో చైనాకు చెందిన 45 పెట్టుబడి ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. వీటిలో గ్రేట్‌ వాల్‌ మోటర్‌, ఎస్‌ఏఐసీ మోటర్‌ కార్పొరేషన్‌ లాంటి కంపెనీల ప్రతిపాదనలు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. 
 
వాస్తవానికి గత కొన్ని వారాల నుంచే ఈ అనుమతులు ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకు చిన్న పెట్టుబడులకే ఈ అనుమతులు పరిమితమయ్యాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించిన తర్వాత పెద్ద ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.
 
ఈ అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసిందని, నీతి ఆయోగ్‌తోపాటు కేంద్ర హోమ్‌, విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖలకు చెందిన అధికారులతో ఈ కమిటీ ఏర్పాటైందని ఆ వర్గాలు వివరించాయి. 
 
ఇది అన్ని రకాల ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించే విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు లాంటిది కాదని ఓ అధికారి తెలిపారు. ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చే అన్ని ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వ శాఖలే స్వయంగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.