రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించాలి 

ఇటీవల  తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం  ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించాలని రాష్ట్ర బిజెపి నేతలు కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీకి  విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  నేతృత్వంలో గడ్కరీతో భేటీ అయిన వారు తెలంగాణ అభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. 

ఇప్పటికే హైదరాబాద్‌లో ఔటర్ రింగ్‌ రోడ్డు ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ రింగ్ రోడ్డుతో వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఆర్‌ఆర్‌ఆర్‌తో హైదరాబాద్‌ చేరుకుండానే బెంగళూరు-వారణాసి, విజయవాడ-ముంబై జాతీయ రహదారులను అనుసంధానం చేసే అవకాశం ఉంది. దీని నిర్మాణం మూడేండ్లలో పూర్తయ్యే విధంగా ప్రణాళికలు చేపట్టాలని గడ్కరీ అంతకు ముందు అధికారులకు సూచించారు. 

 ఈ రహదారితో  రాష్ట్రంలోని 40శాతం మంది ప్రజలకు రింగ్‌ రోడ్డు ఉపయుక్తంగా ఉండనుంది. మొదటి దశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 158 కి.మీల మేర నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. రూ.9,522 కోట్లు నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. రెండో దశలో చౌటుప్పల్‌ – సంగారెడ్డి మధ్య 182 కి.మీల మేర నిర్మాణం చేపట్టనున్నారు. 

ఈ రెండు దశల్లో కలిపి సుమారు రూ.17వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.  ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  ఉంది. హైదరాబాద్‌కు వచ్చే అన్ని హైవేలను కలుపుతూ ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణం జరగనుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుతో లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధితో పాటు పెట్టుబడులు కూడా పెరుగుతాయి’’ అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ఇదో గేమ్‌ ఛేంజర్‌ కానుందని కిషన్ రెడ్డి తెలిపారు. 

ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి అవసరమైన సుమారు 12 వేల ఎకరాల భూసేకరణ పనులను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలని కిషన్‌రెడ్డి కోరారు.  అందుకు  రూ 3,000 కోట్ల  వ్యయం కాగలదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా  వేసింది. తెలంగాణ అభివృద్ధి ముఖ చిత్రాన్ని మార్చే ఈ అపురూప ప్రాజెక్టును కేంద్రం రెండు పార్ట్‌లుగా నిర్వహించబోతోందని చెబుతూ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, నితిన్‌ గడ్కరీలకు కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.