హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్ పచ్చదనం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్క్ చుట్టూ 35 మీటర్ల పరిధిలో ఉన్న ఒక్క చెట్టును కూడా తొలగించకూడదని స్పష్టం చేసింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓవర్ పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కోసం పార్క్ పరిసరాల్లో చెట్లు తొలగించాలని భావించగా కోర్టు స్టే విధించింది.
దీంతో ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఈ వివాదంపై పూర్తి వివరాలు పరిశీలించేందుకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఎలాంటి చెట్లు కొట్టకూడదని కచ్చితమైన నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని చెట్ల ను తొలగించిన జీహెచ్‌ఎంసీ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దిశగా చర్యలు చేపట్టింది.
న్యాయనిపుణుల సలహా మేరకు ప్రాజెక్టుపై తుది నిర్ణ యం తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ భావిస్తుంది. ఆదినుంచి కేబీఆర్ పార్క్ ప్రాజెక్టుకు అడ్డంకులే మొదలయ్యాయి. ప్రాజెక్టును మొదట కాంక్రీట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అనంతరం స్టీల్ బ్రిడ్జిలను నిర్మించాలని ఖరారు చేశారు. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తికాగానే ఏకో సెన్సిటివ్ జోన్ (ఈఎస్‌జడ్) అని ప్రాజెక్టుపై కోర్టు కేసులు పడ్డాయి. అవి నడుస్తుండగా ప్రాజెక్టుకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది.
భూసేకరణపై తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు సుప్రీంకోర్టు చెట్లు నరకరాదనే ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ చుట్టూ నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు పార్కు చుట్టూ ఉన్న 7 కూడళ్లలోనూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లను రూ.1090 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. కేబీఆర్ పార్క్ ప్రధాన ప్రవేశ మార్గపు కూడలి, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్ నెం. 45, ఫిల్మ్‌నగర్, అగ్రసేన్ భవన్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్, ముగ్ధా కూడలిలో వీటిని ని ర్మించే పనులను జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది.
ఈ మేరకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి కాంట్రాక్టు ఏజెన్సీని ఎంపికచేసి పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్‌తో జీహెచ్‌ఎంసీ ఒప్పందం చేసుకుంది. మొదట ముగ్ధా కూడలిలో పనులు ప్రారంభమయ్యాయి. మిగతా కూడళ్లకు సంబంధించిన పనుల్లో భాగంగా ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా కొన్ని చెట్లను ట్రాన్స్ లొకేషన్, కొన్ని చెట్లను అక్కడే కొనసాగించడం, మరికొన్ని తొలగించడం వంటివి జీహెచ్‌ఎంసీ పనులకు శ్రీకారం చుట్టింది.
కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న ప్రాజెక్టులో భాగంగా అన్ని అధికారిక సంస్థల నుంచి అనుమతులు తీసుకున్న అనంతరమే చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేయడం, తొలగించడం, కొనసాగించ డం జరుగుతదని ఇంజినీరింగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఫుట్‌పాత్, సెంట్రల్ మీడియన్‌లోని మొత్తం 1942 చెట్లు ఈ ప్రాజెక్టులో ప్రభావితమవుతున్నాయనీ, 1533 చెట్లను నరికివేయాలని, ఇందులో 600 చెట్లు కోనాకార్పస్ చెట్లున్నాయనీ, 379 చెట్లను ట్రాన్స్‌లొకేషన్, 30 చెట్లను కొనసాగించాలనీ అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.
అటవీ, పర్యావరణ, అర్బన్ బయోడైవర్సిటీ వంటి శాఖల నుంచి అనుమతులు తీసుకున్న అనంతరమే ప్రాజెక్టు పనులు చేపట్టడం జరుగుతుందని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏకో సెన్సిటివ్ జోన్ పరిధిలోనిగానీ, జోన్‌కు 30 మీటర్ల వరకు గానీ ఉన్న ఏ చెట్లనూ తొలగించడం లేదని, కేవలం ఏకో సెన్సిటివ్ జోన్ పరిసరాల్లోని నిషిద్ధ ప్రాంతానికి వెలుపల మాత్రమే చెట్లను అది కూడా ప్రాజెక్టుకు ప్రధానంగా ఆటంకంగా ఉన్న చెట్ల విషయంపైనే జీహెచ్‌ఎంసీ ఫోకస్‌పెట్టినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.

More Stories
ట్రంప్ పోస్ట్ లో అమెరికా జెండా ఉన్న గల్ఫ్ పటం, పేలుడు చిత్రాలు
ప్రధానిగా 12వ వార్షికోత్సవం సందర్భంగా పర్యావరణం, ఇంధన పొదుపు!
తెలంగాణాలో రోజుకు సగటున 8 పోక్సో కేసులు నమోదు