తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ

తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ
తెలంగాణలో డిమాండ్‌కు సరిపడా పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ అందుబాటులో ఉన్నాయని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఇంధన కొరత ఉందని, డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ దొరకడం లేదంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న వేళ తాజాగా ఓఎంసీలు ప్రకటన విడుదల చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చమురు సరఫరాను ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలు పర్యవేక్షిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌ వెల్లడించారు. 
 
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రవాణా, సరఫరాను మరింత వేగంగా అందించేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తేల్చి చెప్పారు. ఇక మే నెలలో మొదటి 15 రోజుల్లోనే పెట్రోల్‌ సరఫరాలో 14.2 శాతం, డీజిల్ సరఫరాలో 15.7 శాతం వృద్ధిని చమురు కంపెనీలు నమోదు చేసినట్లు తెలిపారు. అదే సమయంలో ఎండాకాలంలో విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు తగ్గినట్లు చెప్పారు. 
 
మరోవైపు వినియోగదారులు ముందస్తు బుకింగ్‌లు చేయడం లేదని తేల్చి చెప్పారు. ఈనెలలో 17వ తేదీ వరకు మొత్తం 20.06 లక్షల ఎల్పీజీ సిలిండర్లను వినియోగదారులకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఈ వేసవి సీజన్‌కు ఇది సాధారణమేనని స్పష్టం చేశారు. మిస్డ్‌ కాల్‌, ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌, ఆన్‌లైన్‌‌లో సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని ఎల్పీజీ వినియోగదారులకు ఇంధన కంపెనీలు సూచిస్తున్నాయని తెలిపారు. 
 
గ్యాస్ సిలిండర్ల అక్రమాలను అరికట్టేందుకు అసలైన వినియోగదారులకు సిలిండర్లను అందించేందుకు సిలిండర్ డెలివరీ సమయంలో ఓటీపీ విధానాన్ని పాటిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం 95 శాతానికి పైగా సిలిండర్లు ఇలా ఓటీపీ ఆధారంగానే డెలివరీ చేస్తున్నట్లు చమురు కంపెనీల రాష్ట్ర కో ఆర్డినేటర్ స్పష్టం చేశారు. 
 
దీన్ని వంద శాతం అమలు చేసేందుకు ప్రజలు సహకరించాలని ఇంధన కంపెనీలు, గ్యాస్ ఏజెన్సీలు కోరుతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే నకిలీ వార్తలు, వదంతులను నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఆందోళనకు గురి కావద్దని ఇంధన కంపెనీలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలో డిమాండ్‌కు సరిపడా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ఎక్కడా ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.