సైబర్ నేరాల నిరోధానికి స్టేషన్లలోసైబర్ వారియర్లు

మానవాళి జీవితం డిజిటలైజ్ అవుతున్న క్రమంలో అదే స్థాయిలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను నియమించామని తెలంగాణ  డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పోలీసు రంగంలో ఇదే మొదటిసారని చెప్పారు. 

గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో ఐదుగురు చొప్పున పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. దాదాపు 1,988 పోలీసు అధికారులను ఎంపిక చేసి సోమవారం నుండి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణాకార్యక్రమంని డిజిపి ఏర్పాటు చేశారు.

మారుమూల గ్రామాలకు కూడా 4జి మొబైల్ సేవలు విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా రిమోట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని డీజీపీ పేర్కొనన్నారు. పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు  సైబర్ వారియర్లు కీలకపాత్ర వహిస్తారని చెప్పారు. 

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు రోజువారీ విధి నిర్వహణలో ఇప్పటికే 17 మార్గదర్శకాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని.. ఇక నుండి సైబర్ నేరాలను నిరోధించడం 18వ నిబంధనగా ఉంటుందని తెలిపారు. సాంప్రదాయ నేరాల కన్నా సైబర్ నేరాలు భిన్నంగా ఉంటాయని గుర్తు చేశారు. 

వీటిని ఎదుర్కోవడానికే సైబర్ ఆధారిత నేరాలు, వాటిని ముందస్తుగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రజలను చైతన్య పర్చడం తదితర అంశాల్లో  ప్రత్యేక శిక్షణ  ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరిగే ప్రతి నేర సంఘటనలోను సైబర్ నేర సంబంధిత కాంపోనెంట్ ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ నేరాలను దర్యాప్తుచేసే అధికారులకు ఈ సైబర్ వారియర్లు తోడ్పాటునందిస్తే నేరాల దర్యాప్తు వేగంగా పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

రోజురోజుకు సైబర్ నేరస్తులు ఆధునిక పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాల్సిన అవసరముందని డిజిపి సూచించారు. 

ప్రస్తుత 2021 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టి సంవత్సరంగా జనవరి 1వ తేదీన ప్రకటించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఐజి రాజేష్ కుమార్ ను ఈ విభాగానికి ప్రత్యేక అధికారిగా నియమించామని చెప్పారు. సైబర్ నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులతో ఐజి రాజేష్ కుమార్ సమన్వయ అధికారిగా ఉంటారని చెప్పారు.