తృణమూల్‌ నేతల జేబుల్లోకి ప్రభుత్వ పథకాల సొమ్ము

తృణమూల్‌ సర్కార్‌ పెద్దల ఆమోదం లేకుంటే ప్రభుత్వ పథకాలు పేదలకు చేరడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మమతా బెనర్జీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతులు, పేదల ఖాతాల్లో నేరుగా డబ్బు జమచేస్తోందని, తృణమూల్‌  కాంగ్రెస్‌ దోపిడీదారుల ఆమోదం లేనిదే బెంగాల్‌ ప్రభుత్వ పథకాల సొమ్ము పేదలకు చేరడం లేదని మోదీ ఆరోపించారు.
తృణమూల్‌ నేతల దోపిడీతో ఆ పార్టీ నేతలు లాభపడుతుంటే సాధారణ కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హుగ్లీలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ దీదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు.
బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ నెలలో ప్రధాని రాష్ట్ర పర్యటన ఇది రెండవది కావడం గమనార్హం.  రాష్ట్ర ప్రజలు ‘మార్పు’ కు సంసిద్ధంగా ఉన్నారని ప్రధాని స్పష్టం చేశారు. బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడమే ఇందుకు తార్కాణమని, ఇది ఢిల్లీ వరకూ వినిపించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రజలు మార్పుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం మాత్రం స్పష్టంగా గోచరిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘మీ ఉత్సాహం, శక్తి .. ఢిల్లీకి ఓ మెసేజ్ పంపిస్తోంది. మార్పుకు బెంగాల్ ప్రజలు సంసిద్ధులుగా ఉన్నారన్న విషయం అర్థమౌతోంది.’’ అని పేర్కొన్నారు. హౌరా ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలను కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నామని, ఇప్పటి వరకు అలా జరగలేదని విమర్శించారు.
 
‘గ్యాస్ కనెక్షన్లను ఇవ్వడానికి గతంలో నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టులను ప్రకటించడానికి వచ్చా. రైల్వేలు, మెట్రోను అనుసంధానించడం ప్రాముఖ్యంగా ఎంచుకున్నాం. ఇలాంటి పనులు ఇంతకు పూర్వమే జరిగి ఉండాలి. కానీ జరగలేదు. ఇక ఇప్పుడు ఆలస్యం చేయకూడదు. కావల్సిన అవసరాలకు నిధులు కూడా విడుదల చేస్తున్నాం.’’ అని మోదీ ప్రకటించారు. 
 
కేంద్రం ప్రకటించిన పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి మమతా బనెర్జీపై ప్రధాని ధ్వజమెత్తారు. పేదలకు, రైతులకు కేంద్రం నేరుగా వారి వారి అకౌంట్లలోకే డబ్బులు వేస్తోందని, అయితే ఈ డబ్బులు ప్రజలకు చేరడం లేదని మండిపడ్డారు. 
 
అంతేకాకుండా టీఎంసీ ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీ చేస్తోందని, అందుకే తృణమూల్ నేతలు నానాటికీ సంపన్నులుగా మారుతున్నారని, ప్రజలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారని విమర్శించారు. తాము గనక అధికారంలోకి వస్తే అవినీతి రహిత, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఉన్న రాష్ట్రంగా మారుస్తామని మోదీ హామీ ఇచ్చారు.