రక్షణ ఉత్పత్తుల తయారీలో పూర్తిగా స్వదేశీ 

రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి భారత్ శ్రమిస్తోందని పేర్కొంటూ, ఇందులో ప్రధానంగా సంబంధిత రక్షణ ఉత్పత్తుల తయారీ పూర్తిగా స్వదేశీ కావల్సి ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల పటిష్ట అమలుకు ఏర్పాటు అయిన ఆన్‌లైన్ సదస్సును ఉద్ధేశించి ప్రధాని మాట్లాడుతూ దేశంలో రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 
 
శరవేగంగా ఇక్కడనే రక్షణ ఉత్పత్తుల క్రమాన్ని బలోపేతం చేసుకోవల్సి ఉందని సూచించారు.చిన్న చిన్న  ఆయుధాల కోసం కూడా మనం విదేశాలవైపు చూడవలసి వస్తున్నదని చెప్పారు.  దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు వందలాది ఆయధ ఫ్యాక్టరీలు ఉండేవి. దీనితో దేశం నుంచి భారీ స్థాయిలో దేశాలకు అప్పటి అవసరాలు తీర్చే పలు స్థాయిల ఆయుధ సామాగ్రి ఎగుమతి అయ్యేదని ప్రధాని గుర్తు చేశారు. 
 
రెండు ప్రపంచ యుద్ధాల దశలో కూడా భారతదేశం రక్షణ ఉత్పత్తుల పంపిణీ దేశంగా పేరు తెచ్చుకుందని తెలిపారు. అయితే తరువాతి కాలంలో ఈ వ్యవస్థ పటిష్టం కాకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఈ లోపాన్ని గుర్తించి సర్దుబాటు చర్యలు చేపట్టిందని, పలు వరస క్రమపు చర్యలు తీసుకున్నామని అంటూ వాటి గురించి ప్రధాని వివరించారు.
ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరించడం వల్ల రక్షణ రంగ స్వయం సమృద్ధి దిశలో ముందుకు వెళ్లుతున్నామని తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ఆయుధ రక్షణ ఉత్పత్తుల దిగుమతి దేశాలలో ఒకటి కావడం చింతించాల్సిన విషయమే ప్రధాని పేర్కొన్నారు.