దశాబ్దాలుగా `ఈశాన్యం’పై నిర్లక్ష్యం 

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దశాబ్ధాలుగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంలో ఆయన సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు అభివఅద్ధి పనులను ప్రారంభించారు. 
 
పర్యటనలో భాగంగా రూ. 3,300 కోట్ల పెట్రోలియం ప్రాజెక్టులకు ప్రారంభించిన మోదీ వాటిని జాతికి అంకితం చేశారు. దేమాజీ, సువాల్‌కుచిలో నిర్మించనున్న ఇంజినీరింగ్‌ కళాశాలలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ లు అన్ని అస్సాంలో, ఈశాన్య రాష్ట్రాలలో ప్రజల జీవితాలు మెరుగు పరచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తోడ్పడగలవని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
ఈ ప్రాంత అభివృద్ధి పట్ల గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమాత్రం పాటించుకోలేదని ధ్వజమెత్తారు. ”దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపాయి. ఢిల్లీకి దిస్పూర్‌ చాలా దూరంలో ఉందని గత ప్రభుత్వాలు భావించాయి. కానీ ఇప్పుడు అసోంకు ఢిల్లీ దూరం కాదు. మీ గడప ముందే ఉంది” అని పేర్కొన్నారు.
 
అసోం, ఈశాన్య రాష్ట్రాల అభివఅద్ధి కోసం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమతూకంతో పనిచేస్తున్నాయని ప్రధాని తెలిపారు. ప్రజలకు  ప్రాధమిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకు రాగలిగితే వారిలో విశ్వాసం పెరుగుతుందని, తద్వారా ఈ ప్రాంతంలో నూతన ఉత్సాహం చూడవచ్చని ప్రధాని చెప్పారు. ప్రభుత్వ విధానం సరైనది అయితే, మంచి ఉద్దేశ్యం ఉంటె ప్రజల భవిష్యత్ సహితం విశేషంగా మెరుగవుతుందని స్పష్టం చేశారు.