ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తప్పనిసరి 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం తప్పనిసరి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వ్యాపారంతో ప్రభుత్వానికి సంబంధం లేదని,  ప్రభుత్వం దృష్టి ప్రజా సంక్షేమంపైనే ఉండాలని తేల్చి చెప్పారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) నిర్వహించిన వెబినార్‌లో బుధవారం మాట్లాడుతూ, 2021-22 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంస్కరణల గురించి వివరించారు.

 ‘మోనిటైజ్ అండ్ మోడర్నైజ్’ అనే మంత్రంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొంటూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం మోనిటైజ్ (నగదు రూపంలోకి మార్చడం) చేస్తే, ఆ స్థానంలోకి ప్రైవేటు రంగం వస్తుందని చెప్పారు. ప్రైవేటు రంగం వస్తే పెట్టుబడులు వస్తాయని, అత్యుత్తమ స్థాయి అంతర్జాతీయ విధానాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయని, వీటి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ఖర్చుపెట్టవలసి వస్తోందని ప్రధాని గుర్తు చేశారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రారంభించినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు వేరని చెబుతూ 50 – 60 ఏళ్ళనాటి విధానాలను సంస్కరింప వలసిన అవసరం ఉన్నదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజల సొమ్మును గరిష్టంగా ఉపయోగించడమే  ప్రస్తుత లక్ష్యం అని తెలిపారు. వ్యాపారాలకు, పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయినప్పటికి తానే వాటిని నిర్వహించవలసిన అవసరం లేదని ప్రధాని చెప్పారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను కేవలం వారసత్వాన్ని కొనసాగించడం కోసం నడపకూడదని ప్రధాని హెచ్చరించారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఆర్థిక సహకారం అందించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడుతోందని చెప్పారు. ప్రైవేటు రంగం వల్ల సమర్థత పెరుగుతుందని, ఉద్యోగావకాశాలు కొత్తగా వస్తాయని తెలిపారు. 

నాలుగు వ్యూహాత్మక రంగాలు (అణు శక్తి-ఖగోళ, రక్షణ, రవాణా-టెలీకమ్యూనికేషన్లు, విద్యుత్‌-పెట్రోలియం-బొగ్గు-ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్‌-బీమా-ఆర్థిక సేవలు) మినహా మిగిలిన అన్ని రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధాని  ప్రకటించారు.

ఇప్పటికే చమురు, గ్యాస్‌, విద్యుత్‌ లాంటి వివిధ రంగాల్లోని దాదాపు 100 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను సరిగా ఉపయోగించుకోలేకపోయామని పేర్కొన్నారు. వీటిని నగదీకరించడం ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుందని చెప్పారు. 

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడం వల్ల వచ్చిన సొమ్మును ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ప్రధాని చెప్పారు. ప్రభుత్వం వ్యాపారం చేస్తే, ఆ వ్యాపారం నష్టాలకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నియమ, నిబంధనలకు కట్టుబడి ఉంటుందని, సాహసోపేతమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండదని వివరించారు.

ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించి, పెట్టుబడులను ఉపసంహరించడం వల్ల వచ్చిన సొమ్మును అభివృద్ధి పథకాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఆస్తులను నగదుగా మార్చడం, ప్రైవేటీకరించడానికి తీసుకున్న నిర్ణయాలు భారతీయులను సాధికారులుగా మార్చడానికి దోహదపడతాయని చెప్పుకొచ్చారు.