పెట్రో ధరల పెరుగుదలకు కాంగ్రెస్సే కారణం

పెట్రోల్‌, డీజల్‌ ధరల పెరుగుదలకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని బీజేపీ తమిళనాడు ఎన్నికల  కోఆర్డినేటర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. తంజావూరు శాసనసభ నియోజకవర్గ నిర్వాహకుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం రూపొందించిన కొత్త సాగు చట్టాలను పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల రైతులు మాత్రమే వ్యతి రేకిస్తున్నారని, మరే రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని గుర్తు చేశారు. 

అరియలూరు, జయంకొండాం ప్రాంతాల్లోని రైతులను తాను కలసినప్పుడు, వారు కొత్త సాగు చట్టాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం 175సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. తాము ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని, ప్రజా సంక్షేమానికి అవసరమైన పథకాలు, రైతుల ఆదాయం పెంచే చట్టాలు ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. 

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో సీట్ల కేటాయింపుపై పార్టీ అధిష్ఠానం చర్చలు జరుపుతోందని చెబుతూ మళ్లీ తమ కూటమి అధికారం చేపడుతుందని భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో 9 కోట్ల మందికి ఉచిత వంటగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు. 

పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరల పెరుగదలకు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే కారణమని సుధాకరరెడ్డి విమర్శించారు. ఈ కూటమిలో డీఎంకే కూడా భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. అయినా వీటి ధరలను నియంత్రించే అంశాలను కేంద్రం పరిశీలిస్తోందని రెడ్డి చెప్పారు. 

పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి పాలనాపరంగా విఫలం కావడమే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కారణమని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.