
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని అధికార కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. బలపరీక్షకు ఒక రోజు ముందుగా ఆ పార్టీకి చెందిన కె లక్ష్మీనారాయణన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ వీపీ శివకోజుండుకు రాజీనామా లేఖను ఆదివారం అందజేశారు.
పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలుండగా కాంగ్రెస్‌కు 15 మంది సభ్యులున్నారు. ముగ్గురు డీఎంకే, ఒక ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.
తాజాగా ఎమ్మెల్యే లక్ష్మీనారాయణన్ కూడా రాజీనామా చేయడంతో అధికార కాంగ్రెస్ బలం 10కి పడిపోయింది. కాంగ్రెస్ కూటమి కంటే ప్రతిపక్షాల కూటమి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ప్రస్తుతం అసెంబ్లీలో మెజార్టీ మార్క్15 కాగా, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యా బలం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో బలపరీక్షకు డిమాండ్ చేయగా ఇటీవల ఎల్జీగా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై దీనికి సమ్మతించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని కోరారు. దీనికి ముందుగానే తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. పుదుచ్చేరి అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.
రాజీనామా లేఖలో పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో తాను కలత చెంది ఎమ్మెల్యే పదవిని వీడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా త్వరలోనే పార్టీ నుండి కూడా వైదొలుగుతానని లక్ష్మి నారాయణన్ ప్రకరించారు. తాను పార్టీలో సీనియర్ అయినప్పటికీ..తనకు మంత్రి పదవి ఇవ్వలేదని, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని, దానికి తాను కారణమేమీ కాదని అన్నారు. కాగా, తనను ప్రాంతీయ పార్టీ ఎన్‌ఆర్ కాంగ్రెస్, బిజెపి సంప్రదించినట్లు తెలిపారు. తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
జస్టిస్ వర్మపై సుప్రీం అంతర్గత విచారణ
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా