కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగు చట్టాలు రైతులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోది మొదటి నుంచి ఒకటే మాట చెబుతున్నారు: వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క సదుపాయాన్ని తొలగించకపోగా కొత్త సదుపాయాలను, మెరుగైన ప్రత్యామ్నాయాలను కల్పించేదుకు ఉద్దేశించినవని.
ఈ కొత్త చట్టాల స్ఫూర్తితో మహారాష్ట్రలో రైతు ఉత్పత్తి కంపెనీలు (ఎఫ్ పిసిలు) వాట్సప్ గ్రూపుల ద్వారా, ఎస్ ఎం ఎస్ ద్వారా ఎక్కడెక్కడ ఏయే ఉత్పత్తులకు ఎంతధర ఉన్నదీ ప్రతిరోజూ రైతులకు సమాచారం అందిస్తున్నాయి. ఈ ధరల ఆధారంగా రైతులు తమ పంటలను వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల మార్కెట్లలో అమ్ముకోవాలో లేక ఎఫ్ పిసి సేకరణ కేంద్రాల్లో అమ్ముకోవాలో నిర్ణయించుకుంటున్నారు.
కొత్త వ్యవసాయ చట్టాలు ఆవిష్కరించిన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చుకున్న ప్రధాన సంస్థల్లో మహారాష్ట్ర రైతు ఉత్పత్తి కంపెనీ ఒకటి. ఇందులో 400కు పైగా ఎఫ్ పిసిలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. కొత్త సాగు చట్టాలు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తి మార్కెటింగ్ కమిటీల (ఎపిఎంసి) చట్టం, రైతులకు తమకు నచ్చిన మార్కెట్ ను ఎంచుకునే స్వేఛ్చ కల్పిస్తోందని మహా ఎఫ్ పిసి మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ తోరట్ చెప్పారు. తమ పంటలకు ఎపిఎంసి మండిల కంటే ఎక్కువ ధర వస్తే రైతులు ఎఫ్ పిసి పంటల సేకరణ కేంద్రాల్లో అమ్ముకుంటారు. అలాగే మార్కెట్ లో ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ఎపిఎంసి మండిలలో విక్రయిస్తారు.
రైతులు చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్పత్తులు సరఫరా చేసేటట్లు, అలాగే పంట అమ్మిన రైతులకు సమయానికి డబ్బు ముట్టేటట్టు ఎఫ్ పిసిలు చూస్తున్నాయని తోరట్ తెలిపారు. పోటీ వాతావరణం వల్ల రైతులకు తగిన ధర లభిస్తోందని అన్నారు. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ ల మధ్య లాతూరు, ఉస్మానాబాద్, హింగోలి, నాందేడ్ లలోని తమ సభ్యులు ఎపిఎంసి కమిటీ మండిల వెలుపల తమ పంటలను అమ్ముకోవడం ద్వారా దాదాపు రు 10 కోట్లు సంపాదించినట్టు ఆయన వెల్లడించారు.
మండిల వెలుపల తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) ఎక్కువ ధరలు రావడంతో మరాట్వాడలోని కంది, సోయా రైతులు బయటే అమ్ముకుంటున్నారు. సతారాలో ఎఫ్ పిసిలు తమ ఉత్పత్తులను అమ్మేందుకు తమ సొంత విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. మెరుగైన ధరలు, ఆదాయం కోసం రైతులు తమ పంటలను ఎఫ్ పిసిలు, ప్రైవేటు సంస్థలకు అమ్మేటట్టు మహారాష్ట్ర శేత్కారి సంఘటన రైతులను ప్రోత్సహిస్తోంది.
ధరల నియంత్రణలో ప్రభుత్వ జోక్యం రైతుల ప్రయోజనాలకు హానికరమని శేత్కారి సంఘటన నాయకుడు ఒకరు అన్నారు. దేశీయంగా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు వ్యవసాయ వస్తువులను దిగుమతి చేసుకోకూడదని మహారాష్ట్ర ఉల్లిరైతుల సంఘం అధ్యక్షుడు భారత్ బొగ్లె అభిప్రాయపడ్డారు. అటువంటి సందర్భాల్లో మార్కెట్ కు దాని నియమాల ప్రకారం నడిచే స్వేఛ్చ నివ్వాలని, లాభాలైనా, నష్టాలైనా రైతులే భరిస్తారని ఆయన పేర్కొన్నారు.
కాగా సాగు చట్టాలపై సుప్రీంకోర్టు విధించిన స్టే మండిల వెలుపల రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకోడానికి అవరోధంగా మారిందని ఎఫ్ పిసిలు అంటున్నాయి. ఈ స్టే వల్ల ఈ మూడు చట్టాల అమలుకు అవసరమైన కార్యనిర్వాహక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయడం సాధ్యంకాదు. చట్టాల విషయంలో ప్రతిష్టంబన ఇలాగే కొనసాగితే రైతుల ప్రయోజనాల కోసం తాము నిర్మించాలనుకుంటున్న ప్రత్యామ్నాయ మార్కెటింగ్ వ్యవస్థకు సమస్యలు ఎదురవుతాయని ఎఫ్ పిసిలు ఆందోళన చెందుతున్నాయి.
More Stories
‘జమిలి’ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పూర్వ క్షేత్ర సంఘచాలక్ జస్టిస్ పర్వతరావు కన్నుమూత
2035 నాటికి భారత్కు సొంత స్పేస్స్టేషన్