నాసా రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ లో స్వాతి కీలకపాత్ర

భారత సంతతికి చెందిన మహిళా శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి మోహన్‌ నేతృత్వంలో అంగారక గ్రహంపై అతి క్లిష్టమైన మిషన్‌ విజయవంతంగా పూర్తయ్యింది. మార్స్‌ మీద పరిశోధనలు చేయడానికి నాసా ప్రయోగించిన ‘మార్స్‌ 2020’ మిషన్‌లోని కీలకమైన తొలి ఘట్టం విజయవంతమైంది.  ‘మార్స్‌ 2020′ గైడెన్స్, నేవిగేషన్, అండ్‌ కంట్రోల్స్ (జీఎన్‌ అండ్‌ సీ)కి ఆమె ఆపరేషన్స్‌ లీడ్‌గా ఉన్నారు.
వ్యోమనౌకలోని రోవర్‌ ‘పర్సెవరెన్స్‌’ అరుణగ్రహం మీదున్న జెజెరో అనే లోతైన బిలంలో శుక్రవారం వేకువజామున సురక్షితంగా దిగింది. ఈ మేరకు మిషన్‌ సమన్వయకర్త స్వాతి మోహన్‌ వివరాలు వెల్లడించారు.
‘మార్స్‌ ఉపరితలంపై రోవర్‌ సురక్షితంగా దిగినట్టు నిర్ధారణకు వచ్చాం. ఆ గ్రహంపై జీవం ఉన్నదా? తదితర అంశాలను కనిపెట్టేందుకు ‘పర్సెవరెన్స్‌’ సిద్ధమైంది’ అని చెప్పారు. మిషన్‌లో భాగంగా అరుణగ్రహంపై ల్యాండర్‌ దిగడం.. దాని నుంచి రోవర్‌ బయటకు రావడం వంటి కీలకమైన ఆపరేషన్లను స్వాతి స్వయం గా నిర్వహించారు.
రోవర్‌ మార్స్‌పై దిగినట్టు తెలియగానే నాసా కేంద్రంలో సంబురాలు అంబరాన్నంటాయి. ఈ విజయంపై అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ శాస్త్రవేత్తలను అభినందించారు. సాధారణ రోవర్‌ల కంటే ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ భిన్నమైనది. అలాగే ఎంతో అధునాతనమైనది. ఒక పెద్ద కారు సైజులో ఉండే ఈ రోవర్‌ బరువు 1,026 కిలోలు. రోవర్‌పై ఏడు అత్యాధునిక పరికరాలు, 19 హై-రిజల్యూషన్‌ 3డీ కెమెరాలు, రెండు మైక్రోఫోన్‌లను ఏర్పాటు చేశారు. ఇన్ని కెమెరాలతో అంగారకుడిపైకి పంపిన మొట్టమొదటి అతిపెద్ద రోవర్‌ ఇదే.
రాళ్లను తొలిచేందుకు ఇందులో మినీ రోబో కూడా ఉన్నది. అలాగే అంగారకుడిపై ఏరియల్‌ సర్వే చేయడానికి ‘ఇన్‌జెన్యుటీ’ పేరిట ఓ మినీ హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు. వేరే గ్రహంపైకి పంపిన తొలి హెలికాప్టర్‌ ఇదే. ఆరు చక్రాలున్న పర్సెవరెన్స్‌.. కనీసం రెండేండ్లపాటు మార్స్‌పై పరిశోధనలు జరుపనున్నది. ఇప్పటికే రెండు మార్స్‌ ఫొటోలను ఈ రోవర్‌ పంపించింది.
మార్స్‌పై ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ సురక్షితంగా దిగడంలో డాక్టర్‌ స్వాతి మోహన్‌ కీలక పాత్ర పోషించారు. మిషన్‌ సమన్వయకర్తగా, నావిగేషన్‌ కంట్రోల్‌ ఆపరేటర్‌గా, గైడ్‌గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించారు. మార్స్‌పై రోవర్‌ దిగే సమయంలో ఫ్లెట్‌ కంట్రోలింగ్‌ విధుల్ని ఆమెనే చేపట్టారు.
 మిషన్‌ సక్సెస్‌ అయినట్టు తొలుత ప్రకటించింది కూడా ఆమెనే. స్వాతికి ఏడాది వయసుండగా ఆమె కుటుంబం భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లింది. ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఎమ్మెస్‌, పీహెచ్‌డీ పూర్తి చేశారు. తొమ్మిదేండ్ల వయసున్నప్పుడు టీవీ షో ‘స్టార్‌ ట్రెక్‌’ కార్యక్రమాన్ని చూసి అంతరిక్ష ప్రయోగాలపై ఆసక్తిని పెంచుకున్నట్టు పేర్కొన్న స్వాతి.. పలు నాసా మిషన్లలో పాల్గొన్నారు.